లార్వా ఉంటే జరిమానా!

ABN , First Publish Date - 2022-08-13T06:32:51+05:30 IST

‘‘మీ ఇంటి ప్రాంగణంలో నీటి నిల్వలున్నాయా? వాటిలో లార్వా వృద్ధి చెంది దోమల తీవ్రత పెరుగుతోందా? వెంటనే నివారణ చర్యలు చేపట్టండి.

లార్వా ఉంటే జరిమానా!

ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోండి

దోమల నియంత్రణపై అవగాహన.. అనంతరం తనిఖీలు

పరిస్థితి మారకపోతే చర్యలకు జీహెచ్‌ఎంసీ పరిశీలన


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఇంటి ప్రాంగణంలో నీటి నిల్వలున్నాయా? వాటిలో లార్వా వృద్ధి చెంది దోమల తీవ్రత పెరుగుతోందా? వెంటనే నివారణ చర్యలు చేపట్టండి. దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే జరిమానా తప్పదు’’. లార్వా ఎలా ఏర్పడుతుంది? అది దోమగా ఎలా మారుతుంది? నియంత్రణకు ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించి.. అప్పటికీ మీ వంతు బాధ్యతగా అవసరమైన చర్యలు చేపట్టకపోతే జరిమానా వేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ఉన్నత స్థాయులో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని ఓ అధికారి చెప్పారు. నివాస, వాణిజ్య కేటగిరీ భవనాలకు సంబంధించి ఎవరికి ఎంత జరిమానా వేయాలన్నది చర్చిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం దోమల నియంత్రణకు పెనాల్టీ వేయొచ్చా.. లేదా అన్నది పరిశీలిస్తున్నారు. దోమల నియంత్రణలో పౌరుల భాగస్వామ్యమూ కీలకమన్న ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్టు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. 


అవగాహన.. తనిఖీలు

కాలనీలు, బస్తీల్లో ఎంటమాలజీ బృందాలు ప్రతివారం యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌(ఏఎల్‌ఓ) నిర్వహిస్తాయి. ఇవే బృందాలు.. ఇంటి ప్రాంగణాలను పరిశీలించి నీటి నిల్వలు ఉన్నాయా..వాటిలో లార్వా ఉందా.. అన్నది గుర్తిస్తాయి. లార్వా ఉంటే ఇంట్లో ఉండే వారికి చూపిస్తారు. లార్వా వృద్ధి చెందకుండా ఏం చేయాలో చెబుతారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వలు తొలగించాలని, పరిసర ప్రాంతాల్లోని పాత వస్తువులు తీసేయాలని సూచిస్తారు. ఒకటి, రెండు పర్యాయాలు అవగాహన కల్పించిన అనంతరం.. ఇంటి ప్రాంగణాల్లో పరిస్థితి ఎలా ఉన్నది తనిఖీ చేస్తారు. అప్పటికీ మార్పు కనిపించకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుంటే పెనాల్టీ వేస్తామని ఉన్నతాధికారొకరు చెప్పారు. గ్రేటర్‌లో లార్వా ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టు గుర్తించిన క్రానిక్‌ బ్రీడింగ్‌ ఏరియాలు, లోతట్టు ప్రాంతాల్లో మొదట అవగాహన, తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల పేరిట దోమల నివారణ కార్యక్రమం చేపట్టారు.  ప్రతి శుక్రవారం పాఠశాలలు, కళాశాలలను తనిఖీ చేసి.. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. లార్వా ఉన్న విద్యా సంస్థలకు.. పరిసరాలు శుభ్రం చేసుకోకపోతే భారీ పెనాల్టీ విధిస్తామని హెచ్చరిస్తున్నారు. 


ఇదేంతీరు

దోమల నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి చర్యలు తీసుకోకుండా.. పౌరులపై పెనాల్టీ వేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఎల్‌ఓ, ఫాగింగ్‌ నామమాత్రంగా చేస్తుండడం వల్లే నగరంలో దోమల తీవ్రత పెరుగుతోందని, వారి లోపాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రజలను బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ పౌర సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. దోమల నివారణలో పౌరుల బాధ్యతా ఉంటుంది.. జీహెచ్‌ఎంసీ చేయాల్సింది సక్రమంగా చేసి ప్రజలు ఏం చేయాలో సూచిస్తే బాగుంటుందని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. ‘ప్రజల్లో మార్పు రావాలంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉండాల్సిందే. పెనాల్టీ విధించే ఆలోచన బాగానే ఉన్నా.. ఎలా అమలు చేస్తారు? ఏ ప్రాతిపదికన జరిమానా వేస్తారన్నది కీలకం’ అని లంగర్‌హౌ్‌సకు చెందిన మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-08-13T06:32:51+05:30 IST