Abn logo
Apr 14 2021 @ 11:10AM

మాస్కులపై రోజుకు రూ.40 కోట్ల మేరకు వ్యాపారం...


చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో మాస్కులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఒకవైపు వైరస్‌ భయం, మరోవైపు అధికారుల జరిమానాలతో జనం మాస్కులను కుప్పలుతెప్పలుగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.40 కోట్ల మేర మాస్కుల విక్రయం జరుగుతున్నట్టు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది కంటే ఇప్పుడు కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చటంతో మాస్కుల ధారణ తప్పనిసరి అయ్యింది. ఈ పరిస్థితులలో రాష్ట్రమంతటా గత నెల రోజులుగా అన్ని రకాల మాస్కుల అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 10లక్షలకు పైగా విక్రయమవుతున్నట్టు వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నోస్‌పిన్‌ కలిగిన మాస్కులను దుకాణాలలో రూ.10 నుండి రూ.15కు విక్రయిస్తున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు తయారు చేస్తున్న పునర్వినియోగ మాస్కులను రూ.250కి అమ్ముతున్నారు.  

సోమవారం చెన్నైలో మాస్కులు ధరించకుండా సంచరిస్తున్న 1138 మందికి రూ.200ల చొప్పున ట్రాఫిక్‌ పోలీసులు, కార్పొరేషన్‌ నిఘా కమిటీ అధికారులు జరిమానా విధించారు. ఈనెల 5నుంచి నగరంలో మాస్కులు ధరించకుంటే రూ.200ల చొప్పున జరిమానా విధిస్తామని, రోజుకు రూ.10లక్షల దాకా వసూలయ్యే అవకాశముందని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో మాస్కులు ధరించడం అధికమైనా 40 శాతం మంది మాస్కులు ధరించకుండా సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరమంతటా ట్రాఫిక్‌ పోలీసులు, కార్పొరేషన్‌ నిఘా కమిటీ అధికారులు చేత సెల్‌ఫోన్లు పట్టుకుని మాస్కులు ధరించకుండా వెళుతున్నవారిని ఫోటోలు తీసి వాటి ఆధారంగా జరిమానా వసూలు చేస్తున్నారు. ఆదివారం నగరంలో మాస్కులు ధరించని 892 మందికి రూ.200ల చొప్పున జరిమానా విధించారు. గత ఐదు రోజుల్లో నగరంలో భౌతికదూరం పాటించని 120 మందిపై కేసులు నమోదు చేశారు.


కోయంబేడు వ్యాపారులకు రూ.42 వేల జరిమానా

కోయంబేడు మార్కెట్‌లో మాస్కులు ధరించని, భౌతిక దూరం పాటించని వ్యాపారులకు జరిమానా విధించారు. వారి నుంచి రూ.42 వేలను వసూలు చేసినట్టు ఆ మార్కెట్‌ నిర్వాహక కమిటీ అధికారి గోవిందరాజన్‌ తెలిపారు. గతేడాది కోయంబేడు మార్కెట్‌ కరోనా క్లస్టర్‌ ప్రాంతంగా మారడంతో నెలల తరబడి మూసివేశారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా వుండేందుకు వ్యాపారులు, కొనుగోలుదారులు కరోనా నిరోధక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. 


బీజేపీ ఆఫీసులో ఇద్దరికి కరోనా

స్థానిక టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాలయం కమలాలయంలో ఇరువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ కార్యాలయానికి రోజూ పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు వచ్చివెళుతుంటారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం ఆ కార్యాలయంలో సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. వీరిలో ఇరువురు జలుబు, దగ్గు, జ్వరంతో అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఆ పరీక్షల్లో ఇరువురికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు తేలింది. ఇరువురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఆ కార్యాలయంలోని అన్ని గదులనూ శానిటైజ్‌ చేశారు. 

జాతీయంమరిన్ని...

Advertisement