మావోలకు చెందిన గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-08-07T10:20:34+05:30 IST

మావోయిస్టులకు చెందిన గంజాయి స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్టు స్థానిక డీఎస్‌పీ డాక్టర్‌ వీబీ.రాజ్‌కమల్‌ తెలిపారు.

మావోలకు చెందిన గంజాయి స్మగ్లర్‌ అరెస్టు

పాడేరు డీఎస్‌పీ రాజ్‌కమల్‌ 


పాడేరు, ఆగస్టు 6: మావోయిస్టులకు చెందిన గంజాయి స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్టు స్థానిక డీఎస్‌పీ డాక్టర్‌ వీబీ.రాజ్‌కమల్‌ తెలిపారు. ఇన్నాళ్లు మావోయిస్టులు గంజాయి స్మగ్లర్ల నుంచి  డబ్బులు వసూలు చేసేవారని, కాని కొన్నాళ్లుగా మావోయిస్టులే కొందరు వ్యక్తుల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారన్నారు. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగరువుకి కొలకాని కామేశ్‌(36)కు మావోయిస్టులైన అశోక్‌, అతని భార్య లక్ష్మితో నాలుగేళ్లుగా పరిచయముందన్నారు.


దీంతో మావోయిస్టు భార్యాభర్తలు కామేశ్‌కు గంజాయి ఇస్తూ ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్‌ చేయిస్తున్నారన్నారు. ఆ గంజాయిని కామేశ్‌ ఒడిశాకు చెందిన కృష్ణ, మహారాష్ట్రకు చెందిన రామకృష్ణ, అనిల్‌, గౌతంలకు విక్రయించి, వచ్చిన సొమ్ముతో మావోయిస్టులకు అవసరమైన పరికరాలు, వస్తువులు కొనుగోలు చేస్తున్నాడన్నారు. బుధవారం కామేశ్‌ గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడని, అతని వద్ద 24 కిలోల గంజాయి, రూ.లక్షా 76 వేలు నగదు, మందుపాతరలకు వినియోగించే సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నామన్నారు. ముందస్తు సమాచారం మేరకు కామేశ్‌ను అరెస్టు చేసినట్టు డీఎస్‌పీ రాజ్‌కమల్‌ పేర్కొన్నారు. మావోయిస్టుల దుశ్చర్యలకు ఇటువంటి వ్యక్తులు సహకరించడం వల్లే ఇటీవల ఇంజెరి అడవుల్లో మందుపాతరకు ఇద్దరు గిరిజనులు బలైపోయారన్నారు. 

Updated Date - 2020-08-07T10:20:34+05:30 IST