Abn logo
Sep 18 2021 @ 16:03PM

BJP నుంచి మరింత మంది వస్తున్నారు: టీఎంసీ

న్యూఢిల్లీ: బీజేపీ నేతలు పలువురు తమ పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునల్ ఘోష్ తెలిపారు. బీజేపీలో వారు సంతృప్తిగా లేరని తెలిపారు. ఒకరు (బాబుల్ సుప్రియో) శనివారంనాడు టీఎంసీలో చేరారని, ఆదివారంనాడు ఇంకొకరు పార్టీలో చేరాలనుకుంటున్నారని చెప్పారు. ఈ ప్రక్రియ (చేరికలు) కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఎవరెవరు టీఎంసీలో వస్తున్నారనే ప్రశ్నకు వేచిచూడాలని ఆయన సమాధానమిచ్చారు.

తాజా పరిణామాల్లో భాగంగా, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో శనివారంనాడు టీఎంసీలో చేరారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు కేంద్ర క్యాబినెట్‌ నుంచి ఆయన రాజీనామా చేశారు. కొద్ది వారాల తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు కొందరు బీజేపీ నేతలతో అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయని, సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు పార్టీకి నష్టమని ఆయన చెప్పారు.