తియ్యటి విషం

ABN , First Publish Date - 2022-06-01T06:05:40+05:30 IST

మధురమైన మామిడిని తినడానికి అందరూ ఇష్టపడతారు. వాటిని మాగపెట్టే విధానాన్ని చూస్తే విషం తింటున్నామన్న భయం వేస్తుంది. ఈ ఏడాది దిగుబడి 40 శాతం మాత్రమే రావడంతో మామిడి మంచి ధర పలుకుతోంది.

తియ్యటి విషం

మామిడికి మార్కెట్‌లో మంచి ధరలు

కార్బైడ్‌తో మాగబెడుతున్న వ్యాపారులు

ఆరోగ్యానికి హాని తప్పదంటున్న నిపుణులు

కదిరి, మే 31

మధురమైన మామిడిని తినడానికి అందరూ ఇష్టపడతారు. వాటిని మాగపెట్టే విధానాన్ని చూస్తే విషం తింటున్నామన్న భయం వేస్తుంది. ఈ ఏడాది దిగుబడి 40 శాతం మాత్రమే రావడంతో మామిడి మంచి ధర పలుకుతోంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. పక్వానికి రాకనే మామిడి కాయలను వేరుచేసి, కార్బైడ్‌ వేసి మాగబెడుతున్నారు. వాటిని తింటే జబ్బుల బారిన పడతామని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్బైడ్‌ వేసిన కాయలు రెండురోజులకు మెత్తబడి, వాటిలో పురుగులొస్తున్నాయి.


అధిక ధరలు

కదిరి ప్రాంతంలో దాదాపు పదివేల ఎకరాల్లో మామిడి సాగు చేశారు. గతేడాది నవంబరులో కురిసిన వర్షాలకు మామిడి పూత రాలిపోయింది. నిలిచిన పూత కాయగా మారి 40 శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. దీంతో మామిడి పండ్లకు విపరీతమైన ధరలు వచ్చాయి. బంగినపల్లి మామిడిపండ్లు కేజీ ఏప్రిల్‌, మే నెలల్లో వంద రూపాయలు పలికాయి. మే చివరి వారం నుంచి కాస్త తగ్గి, రూ.80కి చేరాయి. ఇంత ధర పెట్టి సామాన్యులు కొనలేకపోతున్నారు. దిగుబడి తక్కువ కావడంతోపాటు, ఇతర రాషా్ట్రలకు ఎగుమతులు పెరగడంతో ధర మరింత పెరిగింది. కదిరి నుంచి బంగినపల్లి మామిడి కాయలు కాశ్మీర్‌కు వెళ్తున్నాయి. ఇంకా అనేక రాషా్ట్రలకు ఎగుమతి అవుతున్నాయి. 


కార్బైడ్‌తో మాగబెడుతున్నారు..

ధరలు అధికంగా ఉండడంతో రైతుల వద్దనుంచి తోటలు కొనుగోలు చేసిన వ్యాపారులు పక్వానికి రాకనే కాయలను తొలగించి, కార్బైడ్‌ గులికలతో మాగబెడుతున్నారు. దీంతో ఇవి ముందుగానే పండిపోతున్నాయి. ఈ కారణంగా కాయలు రెండురోజులకే దెబ్బతిని, జ్యూస్‌ అవుతున్నాయి. వర్షాలు వచ్చిన తరువాత మామిడి కాయల్లో పురుగులు పడుతున్నాయి. ఇది కూడా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో కాయలను పరీక్షించి, కార్బైడ్‌ ఉపయోగించిన మండీలపై అఽధికారులు దాడులు చేసేవారు. ప్రస్తుతం వాటిని వదిలేశారు. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా కార్బైడ్‌ ఉపయోగించి, కాయలను మాగబెడుతున్నారు. వాటిని తిన్నవారు జబ్బుల బారిన పడుతున్నారు.


డయేరియా, క్యాన్సర్‌..

కార్బైడ్‌ ఉపయోగించి మాగపెట్టిన కాయలు తింటే డయేరియా బారినపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్‌ ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన కార్బైడ్‌ వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.


కార్బైడ్‌తో మాగబెడితే చర్యలు..

కార్బైడ్‌తో మామిడి కాయలు మాగబెడితే చర్యలు తీసుకుంటాం. ఎథిలిన గ్యాస్‌తో పక్వానికి వచ్చిన కాయలను మాగబెట్టాలని సూచించారు. కోల్డ్‌ స్టోరేజీల ద్వారా కూడా మాగబెట్టవచ్చన్నారు.

- జయచంద్రబాబు, ఉద్యాన శాఖాధికారి


Updated Date - 2022-06-01T06:05:40+05:30 IST