ఫలరాజుకు మచ్చ!

ABN , First Publish Date - 2022-06-03T05:07:35+05:30 IST

ఈ ఏడాది పూతలు తక్కువగా ఉన్నందున పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఽధర ఎక్కువ పలుకుతుందని రైతులు ఆశ పెట్టుకున్నారు.

ఫలరాజుకు మచ్చ!
మచ్చలు తేలిన బంగినపల్లి మామిడి

మామిడి రైతుకు ‘అసాని’ దెబ్బ

బంగినపల్లిపై నల్లని మంగు మచ్చలు 

అకాల వర్షాలకు ఆశించిన చీడపీడలు

అమాంతం పడిపోయిన ధరలు

కొనేందుకు వ్యాపారుల వెనుకడుగు


అసలే ఈ ఏడాది పూత తక్కువ.. దీనికితోడు ట్రిప్స్‌ వైరస్‌ బారినపడి పంట దిగుబడి తగ్గిపోయిందని అనుకుంటున్న మామిడి రైతుకు గత నెలలో అసాని తుఫాన ప్రభావంతో కురిసిన వర్షాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వచ్చిన పూతలు వచ్చినట్లే నల్లగా మాడి రాలిపోయాయి. వరుసగా నాలుగు రోజలు అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అప్పుడప్పుడే  పక్వానికి వస్తున్న మామిడిపై దీని ప్రభావం చూపించింది. పచ్చిమామిడి కాయలపై పడిన వర్షం వల్ల అక్కడక్కడా నల్లని మంగు మచ్చలు ఏర్పడి నాణ్యతతోపాటు కాయలను దెబ్బ తీసింది. వెనక చిక్కి వచ్చే పూతలు కూడా నల్లబారిపోయాయి. వైరస్‌ మిగిల్చిన కాయలను అకాల వర్షాలు 70 శాతం దెబ్బతినేలా చేసిందని రైతులు వాపోతున్నారు. 


ఉలవపాడు, జూన 2 : ఈ ఏడాది పూతలు తక్కువగా ఉన్నందున పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. ఽధర ఎక్కువ పలుకుతుందని రైతులు ఆశ పెట్టుకున్నారు. గత నెలలో అకాల వర్షాలు పడక ముందు బంగినపల్లి మామిడి టన్ను రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు  పలికింది. చివరి దశలో రూ.లక్ష దాటుతుందని దిగుబడులు తక్కువైనా అధిక ధరలతో గట్టెక్కవచ్చని అనుకున్న సాగుదారుల సంబరం నీరుగారింది. ప్రస్తుతం ఎర్రనేల మామిడి టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. అదే ఇసుక నేల మామిడి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. ఇసుక నేల మామిడిలో పురుగులు ఉన్నాయని తేలడంతో వాటి ధర ఇంకా పడిపోయేలా ఉంది. ఎర్రనేల మామిడి రైతులు నాణ్యత ఉన్న మామిడిని మాత్రం ధర విషయంలో రాజీపడకుండా అధిక ధరకు అమ్ముతుండటం విశేషం. ఇసుక నేల మామిడి కంటే ఎర్రనేల మామిడిలో పురుగు లేదని ప్రచారం ఉండటంతో వ్యాపారులు దానివేపే మొగ్గు చూపుతున్నారు.


కన్నెత్తి చూడని వ్యాపారులు 


ఉలవపాడు బంగినపల్లి మామిడికి అంతర్జాతీయంగా పేరుంది. ప్రతి ఏడాది ఈపాటికి బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి ఉలవపాడులో తిష్ఠ వేసే వాళ్లు. గుజరాత, బెంగళూరు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులతోపాటు తెలుగు రాష్ట్రాల వ్యాపారులు లారీలతో లోడులు ఎత్తుతుండే వాళ్లు. వీళ్ల రాకతో స్థానికంగా ఉండే మామిడి బ్రోకర్లు, లారీ ఓనర్లు లాభాలు చవిచూసే వారు. అలాంటిది వర్షాల దెబ్బకు మామిడి నాణ్యత దెబ్బతిన్నదని తెలియడంతో ఈ ఏడాది కొనేందుకు ఒక్కరు కూడా ఇటువైపు రాలేదు. 


బహిరంగ మార్కెట్‌కు నాణ్యత లేని మామిడి


నల్లని మచ్చలు ఏర్పడి దెబ్బతిన్న మామిడిని రైతులు స్ధానికంగా బహిరంగ మార్కెట్‌కు తీసుకొచ్చి హోల్‌సేల్‌గా అమ్ముతున్నారు. మచ్చలు ఉండడంతో బయట నుంచి వచ్చిన చిన్న, సన్నకారు వ్యాపారులకు వచ్చినకాడకు జమ అన్నట్లు అమ్మేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 10 కి.మీ వరకు మామిడి అంగళ్లు ప్రతిఏటా వెలుస్తాయి. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువ కావడంతో తోటల యజమానులు అధిక ధరలు చెబుతుండటంతో అంగళ్లలో వ్యాపారం జరగడం లేదని, వాహనదారులు కొనేందుకు ముందుకు రావడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2022-06-03T05:07:35+05:30 IST