మరో బేరం!

ABN , First Publish Date - 2021-09-17T05:55:32+05:30 IST

మంగళగిరి నగరపాలకసంస్థకు..

మరో బేరం!
మంగళగిరి నిడమర్రు రోడ్డు వెంబడి వున్న మునిసిపల్‌ డంపింగ్‌యార్డు

డంపింగ్‌యార్డు స్థలం కాజేసేందుకు మళ్లీ పథకం

2009లో అడ్డుకున్న ఆంధ్రజ్యోతి

ఇన్నాళ్లకు బేరాలు పెట్టిన ప్రైవేటు వ్యక్తులు

రిజిస్ట్రేషన్‌కు సహకరించాలని ఎమ్మెల్యేను కలిసిన కొనుగోలుదారులు

బహిరంగ మార్కెట్‌లో రూ.25 కోట్ల పైమాటే!

 

మంగళగిరి(గుంటూరు): మంగళగిరి నగరపాలకసంస్థకు చెందిన డంపింగ్‌యార్డు స్థలంపై మరోమారు అక్రమార్కుల కన్ను పడింది. నగరంలోని అమరావతి టౌన్‌షిప్‌కు సమీపంలో రైల్వేట్రాక్‌ వెంబడి నిడమర్రు రోడ్డు పక్కగా 2.36 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్‌యార్డు ఉంది. అత్యంత విలువైన ఈ స్థలాన్ని కాజేసేందుకు 2009 నుంచి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థలం తమదేనంటూ తరచుగా ఓ ముస్లిం కుటుంబం స్థలాన్ని బేరాలకు పెడుతోంది. 


నిడమర్రు రోడ్డు వెంబడి సర్వే నెం. 234-ఎ, 234 బి 1లో నాటి మంగళగిరి పురపాలక సంఘానికి 2.36 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్‌యార్డు ఉంది. ప్రస్తుత మార్కెట్‌లో దీని విలువ రూ.25 కోట్లకు పైబడి వుంటుంది. ఇంత విలువైన ఈ స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు 2009-10 కాలంలోనే కుట్ర జరిగింది. అప్పట్లో ఈ స్థలాన్ని ఓ ముస్లిం కుటుంబం నగరానికే చెందిన ఓ ధార్మిక సంస్థకు విక్రయిస్తూ రహస్యంగా రిజిస్ట్రేషన్‌ను కూడ జరిపించింది.  నాడు ఆంధ్రజ్యోతి ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. అప్పటి కలెక్టర్‌గా ఉన్న రామాంజనేయులు స్వయంగా రంగంలో దిగి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించారు.  


తాజాగా డంపింగ్‌యార్డు స్థలాన్ని కొనుగోలు చేసే విషయంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమకు సహకరించాలనే ఉద్దేశంతో కందుకూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి అక్కడి వైసీపీ నాయకుల సిఫారసుతో మంగళగిరి వచ్చారు. అయితే ఇక్కడ చుక్కెదురైంది. అది ప్రభుత్వ స్థలం దానిని మీరెలా కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే ఆళ్ల వారిని ప్రశ్నించారు. అమ్మకందార్లు కొన్ని నకళ్లతోపాటు ఆ స్థలం పురపాలకసంఘం తాలూకు ఆస్తులతో మ్యాచ్‌ కావడం లేదంటూ 2017లో నాటి మునిసిపల్‌ అధికారులు ఇచ్చిన ఓ పత్రాన్ని ఎమ్మెల్యేకు చూపినట్టు తెలిసింది. వీటి ఆధారంగా తాము సదరు స్థలాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు వెంకటేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారంటున్నారు.  సదరు స్థలాన్ని తమకు బేరం పెట్టి అడ్వాన్స్‌గా రూ.కోటి తీసుకున్నారని చెప్పడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. వాస్తవానికి అడంగల్‌లో అది ప్రభుత్వ భూమిగా రికార్డయింది.


అలాగే నిషేధిత భూముల జాబితా 22-ఎలోనూ సదరు సర్వే నెంబర్లు 234-ఎ, 234 బి1లు వున్నాయి. అలాంటప్పుడు దానిని ప్రైవేటు భూమిగా ఎలా భావిస్తారని ఎమ్మెల్యే ఆళ్ల వారిని నిలదీశారు. ఇందులో ఏదో కుట్ర ఉందని... అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకుండా వచ్చినదారినే వెళ్లిపోవాలని... లేని పక్షంలో పోలీసులను పిలిపిస్తామని ఎమ్మెల్యే కటువుగా చెప్పడంతో వెంకటేశ్వరరెడ్డి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-09-17T05:55:32+05:30 IST