పరిశ్రమల నిర్వాకం.. ‘దారి’ద్య్రం!

ABN , First Publish Date - 2022-05-23T06:27:20+05:30 IST

మండల కేంద్రం పరవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో కొన్ని నెలలుగా పరిశ్రమల వ్యర్థాల డంపింగ్‌ యథేచ్ఛగా కొనసాగుతోంది.

పరిశ్రమల నిర్వాకం.. ‘దారి’ద్య్రం!
పరవాడ రహదారి ఆద్యంతం పేరుకుపోయిన వ్యర్థాలు

బహిరంగ ప్రదేశాల్లోనే వ్యర్థాల డంపింగ్‌

ప్రధాన రహదారి ఆద్యంతం చెత్తాచెదారం

నియంత్రణపై దృష్టిసారించని అధికారులు

కలుషితమవుతున్న భూగర్భ జలాలు


పరవాడ, మే 22: పరిశ్రమల యాజమాన్యాల ‘చెత్త’ నిర్వాకంతో ప్రధాన రహ‘దారిద్య్రం’ అవుతోంది. రోడ్డంతా చెత్తాచెదారం తాండవిస్తోంది. భరించలేని దుర్వాసనతో వాహన చోదకులు ముక్కున వేలేసుకోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. సరికదా! పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జం కలుషితమవుతోంది. అయినప్పటికీ అధికార యంత్రాంగం తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తోంది.


 మండల కేంద్రం పరవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో కొన్ని నెలలుగా పరిశ్రమల వ్యర్థాల డంపింగ్‌ యథేచ్ఛగా కొనసాగుతోంది. మండల పరిషత్‌ కార్యాలయ జంక్షన్‌ నుంచి ఫార్మాసిటీకి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని చెత్తాచెదారాలను ఇష్టానుసారంగా పడేస్తు న్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పరవాడ పొలాలను ఆనుకొని ఏర్పాటు చేసిన రహదారి, సింహాద్రి ఎన్టీపీసీ నుంచి నునపర్తి గ్రామానికి వెళ్లే రహదారి వెంబడి వ్యర్థాలను గుట్టల గుట్టలుగా వేసి వెళ్లిపోతున్నారు. రాత్రి వేళల్లో లారీలు, ఆటోలు, వ్యాన్‌ల ద్వారా చెత్తను తీసుకొచ్చి డంపింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. 

ఫార్మాసిటీకి ఆనుకొని ఉన్న ఇండస్ట్రియల్‌ పార్కు, అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమల నుంచి వ్యర్థాలను గుట్టచప్పుడు కాకుండా పడవేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో విడిచిపెట్టకూడదని నిబంధనలు చెబుతున్నా యాజమాన్యాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. దీంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నదని వాహన చోదకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో అటుగా రాకపోకలు సాగించేందుకు నరకం చూస్తున్నామని వాపోతున్నారు. 


కలుషితమవుతున్న భూగర్భ జలాలు..

పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పచ్చికబయళ్లతో కళకళలాడే ప్రాంతాలు, నేడు కళావిహీనంగా మారిపోయాయి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో పరిశ్రమల యజమానులు ఆగడాలకు అదుపులేక పోతోంది. ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పడవేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-23T06:27:20+05:30 IST