మన కోడి మటాష్‌!

ABN , First Publish Date - 2021-07-25T15:47:49+05:30 IST

ఒకపక్క..

మన కోడి మటాష్‌!

రెండేళ్లుగా అమలుకు నోచని దళిత మహిళల పథకం 

వాటాగా రూ.48.6 లక్షలు చెల్లించిన లబ్ధిదారులు 

ప్రభుత్వ వాటా నిలిపివేత

కోళ్ల కోసం దళిత మహిళల ఎదురుచూపు 

కాంట్రాక్టర్‌కు చెల్లింపులు శూన్యం


ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఒకపక్క దళితుల కోసం అంత చేస్తున్నాం.. ఇంత చేస్తున్నాం అంటూ ప్రకటనలిచ్చి బాకాలూదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క దళితుల కోసం ఉన్న పథకాలను ఊడబీకుతోంది. చేయూత పేరుతో ఉపాధి కల్పిస్తున్నట్టు ఊదరగొడుతూ ఎస్సీ, ఎస్టీల ఉపాధిని దెబ్బతీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై దళితులకు జీవనోపాధి కల్పించిన ‘మన కోడి’ పథకాన్ని రెండేళ్లుగా ఆపేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. లబ్ధిదారులు చెల్లించిన వాటా సొమ్మును కూడా తిరిగి చెల్లించలేదు.ఈ పథకం బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్ట్‌ సంస్థనూ ముంచేసింది. 


పథకం ఉద్దేశమిదీ..

ఎస్సీ, ఎస్టీ మహిళలకు కోళ్లు ఇస్తారు. పేద దళిత కుటుంబాలకు ఈ కోళ్ల ద్వారా ఉపాధితోపాటు మంచి పోషకాహారం అందుతుందనేది ఉద్దేశం. ఈ పథకం కింద ఒక్కొక లబ్ధిదారుకు ఏడాదికి 45 కోళ్లు అందిస్తారు. మొదటి దశలో 25 కోళ్లు, నాలుగు నెలల తర్వాత మరో 20 కోళ్లు అందిస్తారు. ఒక్కొక కోడి ధర రూ.68. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.18. ప్రభుత్వ వాటా రూ.50. మొత్తం కోళ్లకు ఒకేసారి లబ్ధిదారుల వాటా చెల్లించాలి.


టీడీపీ హయాంలో ఇలా..

గత టీడీపీ ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2017, 2018 సంవత్సరాలలో జిల్లాలో ఏటా 4000 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ‘మన కోడి’ పథకం కింద లబ్ధి చేకూర్చింది. 2019 సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్య మరో 2000 పెరిగి మొత్తం 6000 మంది అయ్యారు. 


ప్రస్తుత ప్రభుత్వం ఇలా..

ఈ పథకం కింద 2019లో ప్రస్తుత ప్రభుత్వం మొదటి స్పెల్‌లో జిల్లాలో 3000 మంది లబ్ధిదారులకు మాత్రమే కోళ్లు అందించింది. సగం మందికి అందించలేదు. రెండో స్పెల్‌కు సంబంధించి అసలు ఎవరికీ కోళ్లు అందించలేదు. ఆ తరువాత 2020, 2021 సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పథకం పూర్తిగా నిలిచిపోయింది. 


లబ్ధిదారుల వాటా రూ.48.6 లక్షలు హుళక్కి

మన కోడి పథకం కింద జిల్లాలో 6 వేల మంది లబ్ధిదారులు తమ బెనిఫిషియరీ షేర్‌ చెల్లించారు. అంటే మొత్తం రూ.48.6 లక్షలు చెల్లించారన్నమాట. ప్రభుత్వం వాటా రూ.1.35 కోట్ల మాత్రమే చెల్లించాలి. అది కూడా చెల్లించకుండా దళితుల పట్ల వివక్ష చూపింది. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసినట్టు ఎక్కడా ప్రకటించలేదు. అలాగని కొనసాగించడమూ లేదు. కనీసం లబ్ధిదారులకు వారు చెల్లించిన బెనిఫిషియరీ సొమ్మును కూడా వెనక్కి ఇవ్వలేదు. కోళ్ల ద్వారా... గుడ్లు, మాంసం వంటి ఉత్పత్తుల ద్వారా ఉపాధి పొందుతున్న దళితులకు రెండేళ్లుగా ఈ పథకం అమలు కాకపోవటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.  జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో లబ్ధిదారులు ఉన్నారు. చల్లపల్లి, ముసునూరు, కంకిపాడు, కానూరు, పెనమలూరు, కంచికచెర్ల, కాటూరు ప్రాంతాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులున్నారు. వాటా డబ్బు చెల్లించినా కోడి పిల్లలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.   


కాంట్రాక్టర్‌కు బిల్లు నిల్‌ 

ఈ పథకాన్ని ప్రభుత్వం పశు సంవర్థక శాఖ నేతృత్వంలో అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి పశు సంవర్థక శాఖ కోడి పిల్లల కోసం కాంట్రాక్టుకు ఏజెన్సీలను పిలుస్తోంది. ఇలా జిల్లాలో ఓ ఏజెన్సీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఆ ఏజెన్సీ వనరాజా, క్రాయిలర్‌ జాతులకు చెందిన చిన్న కోడి పిల్లలను కొనుగోలు చేసి కొద్ది రోజులపాటు వాటిని పెంచి పశు సంవర్థక శాఖకు అందిస్తుంది. సంబంధిత కాంట్రాక్టు సంస్థకు 2019లో మొదటి స్పెల్‌లో అందించిన కోళ్లకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. రెండో స్పెల్‌ కోసం  సంస్థ ముందుగానే కోడి పిల్లలను కొని పెద్దవి చేసి అందించటానికి సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రెండో స్పెల్‌లో కోడి పిల్లలను తీసుకోవటానికి పశుసంవర్థక శాఖ ఇష్టపడలేదు. దీంతో కోడి పిల్లలను సమకూర్చుకున్న కాంట్రాక్టు సంస్థకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొదటి స్పెల్‌ బిల్లు చెల్లించమని రెండేళ్లుగా తిరుగుతున్నా అతీ, గతీ లేకుండా పోయింది. దీని వల్ల పథకం పూర్తిగా ఆగిపోయినట్టయింది. డబ్బులు కట్టిన లబ్ధిదారులూ, బిల్లులు రాక కాంట్రాక్టు సంస్థ యజమానీ నష్టపోయారు. 


Updated Date - 2021-07-25T15:47:49+05:30 IST