స్వాబ్ శాంపిల్ స్టిక్స్ తయారీలో మోసం.. వ్యక్తి అరెస్ట్..

ABN , First Publish Date - 2021-05-08T01:53:14+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ కొందరు వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకుని భారీ మోసాలకు..

స్వాబ్ శాంపిల్ స్టిక్స్ తయారీలో మోసం.. వ్యక్తి అరెస్ట్..

థానే: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ కొందరు వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. థానే జిల్లాలో ఓ వ్యక్తి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున స్వాబ్ శాంపిల్ స్టిక్ సేకరించి, వాటిని అపరిశుభ్రంగా ప్యాక్ చేయించి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని ఉల్హాస్‌నగర్‌కు చెందిన మనీశ్ కేశ్వానీగా పోలీసులు గుర్తించారు. అతడు వెయ్యి శ్వాబ్ శాంపిల్ స్టిక్స్‌కి గానూ 20 రూపాయలు ఇచ్చి స్థానికుల నుంచి సేకరిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. సేకరించిన ఈ స్టిక్స్‌ని కొవిడ్ ప్రోటోకాల్‌కి విరుద్ధంగా మహిళలు, చిన్నపిల్లలతో అపరిశుభ్ర వాతావరణంలో ప్యాక్ చేయిస్తున్నట్టు గుర్తించామని ఓ అధికారి వెల్లడించారు. ‘‘రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అధికారుల ఫిర్యాదు మేరకు కేశ్వానీని అరెస్ట్ చేశాం. అతడిపై ఐపీసీ సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల నివారణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం..’’ అని ఆయన తెలిపారు. శ్వాబ్ స్టిక్స్ ప్యాకింగ్ చేస్తున్న ఓ వీడియో రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Updated Date - 2021-05-08T01:53:14+05:30 IST