Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాత్రి ఆలస్యంగా వచ్చిన భర్త.. ఇంట్లో అంతా చీకటి.. పిలిచినా పలకని భార్య.. లైట్ వేసి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఒక ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్న తపన్ మోండల్ అనే వ్యక్తి ఆరోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండటంతో రోజూ వచ్చే సమయానికి ఇంటికి రాలేదు. ఇంటికి బయలుదేరే ముందు భార్యకు ఫోన్ చేశాడు. ఆమె ఎత్తలేదు. సరే ఏదైనా పనిలో ఉందేమో అనుకొని ఇంటికి వెళ్లాడు. ఇంటికి కొద్ది దూరంలోకి రాగానే తమ ఫ్లాట్‌లో లైట్లు ఆర్పేసి ఉండటం గమనించాడు. ఏమైందా? అనుకున్నాడు. ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఎవరూ తీయలేదు. తన దగ్గరున్న తాళం చెవితో తలుపు తీశాడు. భార్యను పిలిచాడు. ఉలుకూ పలుకూ లేదు. ఇంట్లో ఒక్క లైటు కూడా వేసి లేదు. దీంతో అనుమానం వచ్చి ముందు లైట్ వేశాడు. అంతే, అతని గుండె పగిలిపోయింది.


ఇంట్లో ఉండాల్సిన తన భార్య సుస్మిత, 8వ తరగతి చదువుకుంటున్న కుమారుడు తోమోజిత్.. ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఎవరో వారి పీకలు కోసి చంపారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వెలుగు చూసింది. ఇక్కడ పర్ణశ్రీ ప్రాంతంలో తపన్ మోండల్ దంపతులు నివసిస్తున్నారు. భార్యాబిడ్డల మృతదేహాలను చూసిన తపన్ పెద్దగా అరవడంతో పక్క ఫ్లాట్ల వాళ్లు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు ఈ సమాచారం అందడంతో వాళ్లు రంగంలోకి దిగారు. బాలుడు స్కూల్ యూనిఫాంలో ఉండటంతో ఆన్‌లైన్ క్లాసు వింటుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సుస్మిత మొబైల్ ఫోన్ కనిపించడం లేదని చెప్పారు. అపార్ట్‌మెంట్ వాష్‌రూంలో రక్తపు మరకలను గుర్తించారు. ఇది మొత్తం ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన దారుణమని పోలీసులు భావిస్తున్నారు.


ప్రతిరోజూ 5గంటలకు తోమోజిత్‌కు ట్యూషన్ చెప్పేందుకు వచ్చే టీచర్‌ను అడగ్గా.. తాను ఎప్పట్లాగే వచ్చానని, కానీ ఎవరూ తలుపు తీయలేదని ఆయన చెప్పారు. ‘‘ఫోన్ చేసినా సమాధానం లేదు. తలుపులు కొట్టి, కేకలు వేసినా బదులు రాలేదు. దీంతో నేను వెనుతిరిగా’’ అని ఆయన తెలిపారు. ఈ క్రమంలో స్నిఫర్ డాగ్స్, ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement