కాలేజీ గేటు ముందే విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2022-06-08T20:08:50+05:30 IST

బాధితుల్లో ఒకరైన ఒక విద్యార్థి ఈ విషయమై మాట్లాడుతూ ‘‘కాలేజీ గేటు బయట ఆ వ్యక్తి(నిందితుడు)ని సంవత్సర కాలంగా చూస్తున్నాను. వచ్చి కారెక్కమంటూ అతడు చాలా అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు. అనుచిత పదజాలం కూడా ఉపయోగిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇతర విద్యార్థినులతో చెప్తే వాళ్లు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పారు..

కాలేజీ గేటు ముందే విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లోని మహారాణి కాలేజీ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ కాలేజీలోని విద్యార్థినులందరూ సోమవారం నుంచి నిరసన చేపట్టారు. అంతే కాకుండా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన సదరు వ్యక్తి ఆకృత్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇబ్బందికరమైన తమ అనుభవాలను నెటిజెన్లకు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ యూసఫ్ అని, అరెస్ట్ అనంతరం అతడిపై ఐపీసీలోని సెక్షన్ 151 ప్రకారం కేసు నమోదు చేసినట్లు లాల్‌ కోతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ సురేందర్ సింగ్ తెలిపారు.


బాధితుల్లో ఒకరైన ఒక విద్యార్థి ఈ విషయమై మాట్లాడుతూ ‘‘కాలేజీ గేటు బయట ఆ వ్యక్తి(నిందితుడు)ని సంవత్సర కాలంగా చూస్తున్నాను. వచ్చి కారెక్కమంటూ అతడు చాలా అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నాడు. అనుచిత పదజాలం కూడా ఉపయోగిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇతర విద్యార్థినులతో చెప్తే వాళ్లు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పారు. కాలేజీ అయిపోయి 2-3 ఏళ్ల అయిన వారు కూడా తమకు ఈ అనుభవం ఎదురైందని చెప్పారు. దీంతో కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాం. కాలేజీ ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు భద్రత కల్పించాలని నిరసన చేపట్టాం’’ అని తెలిపారు.


కాగా, కాలేజీ ప్రిన్సిపాల్ అభ జైన్ మాట్లాడుతూ ‘‘కాలేజీ బయట అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వెంటనే గేటు బయట సీసీటీవీ కెమెరాలు పెట్టించాం. అలాగే గేటు బయట పోలీస్ బూత్ పెట్టించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ విషయమై పోలీసు అధికారులకు ఒక అప్లికేషన్ ఇప్పటికే పెట్టాము. అయితే కాలేజీలో ఇప్పటికే మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. కాకపోతే భద్రతను మరింత పెంచడానికి ప్రయత్నిస్తాం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-08T20:08:50+05:30 IST