గూగుల్ మ్యాప్స్ మా కాపురంలో చిచ్చుపెట్టింది... పోలీసులకు బాధితుడి ఫిర్యాదు..

ABN , First Publish Date - 2020-05-22T23:41:21+05:30 IST

ప్రముఖ ఆన్‌లైన్ మ్యాపింగ్ యాప్ గూగుల్ మ్యాప్స్‌ తన వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని ఆరోపిస్తూ తమిళనాడుకు చెందిన...

గూగుల్ మ్యాప్స్ మా కాపురంలో చిచ్చుపెట్టింది... పోలీసులకు బాధితుడి ఫిర్యాదు..

చెన్నై: ప్రముఖ ఆన్‌లైన్ మ్యాపింగ్ యాప్ గూగుల్ మ్యాప్స్‌ తన వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని ఆరోపిస్తూ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై సదరు టెక్ దిగ్గజాన్ని కోర్టుకు లాగేందుకు కూడా సిద్ధమయ్యాడు. నాగపట్నం జిల్లా మైలదుత్తురైకి చెందిన 49 ఏళ్ల ఫ్యాన్సీ షాపు యజమాని చంద్రశేఖర్ అనే వ్యక్తి విచిత్రగాథ ఇది. తాను ఎన్నడూ సందర్శించని ప్రదేశాలను కూడా వెళ్లినట్టు చూపిస్తున్న గూగుల్ మ్యాప్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ అతడు నిన్న స్థానిక పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. యాప్‌లో కనిపించిన తప్పుడు వివరాల కారణంగా కుటుంబ జీవితంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘గత కొద్ది నెలలుగా నా భార్య నిత్యం గూగుల్ మ్యాప్స్‌లోని ‘యువర్ టైమ్‌లైన్’ ఫీచర్‌ను తనిఖీ చేస్తోంది. ఎక్కడెక్కడ తిరిగావో చెప్పాలంటూ రాత్రి పూట కనీసం కూడా పోనివ్వడం లేదు. అస్తమానం దీని గురించే ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడుచేసుకుంది. తనతోపాటు మిగతా కుటుంబ సభ్యులందరి మీదా ఆ ప్రభావం పడింది...’’ అని బాధితుడు ఆరోపించాడు. తాను వెళ్లని ప్రదేశాలను కూడా వెళ్లినట్టు గూగుల్ మ్యాప్స్‌లో చూపించడం వల్లే రకరకాల అనుమానాలు, సమస్యలు తలెత్తుతున్నాయని అన్నాడు. 


‘‘ఆమె ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు చివరికి కౌన్సిలర్లు చెప్పినా ఆమె వినిపించుకోవడం లేదు. ఏదైనా సరే గూగుల్‌నే నమ్ముతానని పట్టుపడుతోంది. గూగుల్ నా కుటుంబ జీవితాన్ని నాశనం చేసింది. కాబట్టి గూగుల్‌పై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. నా కుటుంబంలో కలహాలు రేపినందుకు గూగుల్ నుంచి పరిహారం ఇప్పించాలని కూడా కోరుతున్నాను..’’ అని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. తొలుత భార్యాభర్తలిద్దర్నీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తామనీ.. అది ఫలించని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-05-22T23:41:21+05:30 IST