మోదీ పిలుపు ‘వ్యక్తిగత అంశం’ : మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2020-04-04T19:00:56+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమేయడానికి, దేశం ఐక్యంగా ఉందని చాటడానికి విద్యుత్ దీపాలు ఆర్పేయాలని ప్రధాని మోదీ పిలుపుపై పశ్చిమ బెంగాల్

మోదీ పిలుపు ‘వ్యక్తిగత అంశం’ : మమతా బెనర్జీ

కోల్‌కత్తా : కరోనా మహమ్మారిని తరిమేయడానికి, దేశం ఐక్యంగా ఉందని చాటడానికి విద్యుత్ దీపాలు ఆర్పేయాలని ప్రధాని మోదీ పిలుపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘‘ప్రధాన మంత్రి వ్యవహారాల్లో నేనెందుకు కల్పించుకోవాలి?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను కరోనాను నియంత్రించాలా? లేదా రాజకీయాలు చేయాలా? అని సూటిగా ప్రశ్నించారు.


ఇద్దరి మధ్యా రాజకీయుద్ధానికి ఎందుకు తెర లేపుతున్నారు? దయచేసి రాజకీయ యుద్ధానికి తెరలేపకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇచ్చిన పిలుపును ‘వ్యక్తిగత అంశం’ గా బెనర్జీ అభివర్ణించారు. మీరు పాటించాలనుకుంటే పాటించండని, నన్నెందుకు అడుగుతున్నారని ఆమె విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ‘‘నేనేం చేయాలనుకుంటున్నానో నేను చెబుతాను... ప్రధాని ఏం చేయాలనుకుంటున్నారో ఆయన చెబుతారు. ఆయన వ్యవహారాల్లో నేనెందుకు కల్పించుకోవాలి? ఆయన పిలుపు మీకు నచ్చితే మీరు ఆచరించండి. అది పూర్తిగా వ్యక్తిగతం’’ అని పేర్కొన్నారు. 


ఏప్రిల్‌ 5వ తేదీన అంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలి. చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు లేదా సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు... ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలి. నా కోసం మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు కేటాయించండి. జనతా స్ఫూర్తిని మరోమారు చాటండి’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-04T19:00:56+05:30 IST