మమత కర్తవ్యం

ABN , First Publish Date - 2021-05-06T06:08:22+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస కచ్చితంగా ఆందోళన కలిగించేదే. కనీసం డజనుమంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు....

మమత కర్తవ్యం

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస కచ్చితంగా ఆందోళన కలిగించేదే. కనీసం డజనుమంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. లూటీలు, గృహదహనాలు పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని చోట్ల జనం తమ ఇళ్ళను వదిలేసి పారిపోవలసివచ్చింది. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేయబోయే ముందు, ప్రధాని నరేంద్రమోదీ ఈ హింసాకాండమీద తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ రాష్ట్ర గవర్నర్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ప్రధాని ఆవేదనకు తన ఆవేదనను కూడా చేర్చి శక్తిమేర గవర్నర్‌ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మమతకు ఏవో హితవులు కూడా చెప్పారు. బెంగాల్ హింసమీద మీడియాలో సాగుతున్న ప్రచారం, నకిలీ వార్తలను దట్టించి మరీ సోషల్‌ మీడియాలో నడుస్తున్న దుష్ర్పచారం మమతకు కేంద్రం పన్నుతున్న కొత్త కుట్రలాగా అనిపించింది. ఎన్నికల ద్వారా బెంగాల్‌ను వశం చేసుకోలేకపోయిన బీజేపీ, శాంతిభద్రతల సాకుతో రాష్ట్రపతి పాలన ద్వారా వశం చేసుకోవాలని అనుకుంటోందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే ఈ కల్లోల పరిస్థితులను ఒక కొలిక్కితెస్తానని హామీ ఇచ్చిన మమతా బెనర్జీ, అందుకు కట్టుబడటమే కాక, బాధ్యులను శిక్షించడమూ ముఖ్యం. 


ఇలాంటి ఘటనలు ఎన్నడూ లేవనీ, దేశవిభజన సమయంలోనే ఇంత తీవ్రహింస జరిగిందని బీజేపీ అధ్యక్షుడు జేపి నడ్డా అంటున్నారు. బాధిత బీజేపీ మద్దతుదారులకు అండగా ఉండేందుకు బెంగాల్‌ తరలివచ్చి, పలుప్రాంతాల్లో పర్యటించి, ఆయా కుటుంబాల వారిని ఓదార్చారు ఆయన. సభలూ సమావేశాలూ హెచ్చరికలతో బీజేపీ ఈ దాడుల అంశాన్ని పతాకస్థాయికి తీసుకుపోయింది. గవర్నర్‌కు ప్రధాని ఫోను చేయడమే కాక, కేంద్రహోంశాఖ ఈ ఘటనలపై రాష్ట్రం నుంచి వివరణ కూడా కోరింది. హింసాకాండపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నాయకుడు ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కూడా. ఓడినవారు ఉక్రోషంతో హింసకు పాల్పడటం విన్నాం కానీ, గెలిచినవారు ఓడినవారిని వేటాడటమేమిటి అంటూ బెంగాల్‌ పరిణామాలపై కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో ఏదో ఉన్నదని వారికి అనిపిస్తున్నది. ఈ విధ్వంసానికి మమతా బెనర్జీ ఆశీస్సులు ఉన్నాయా లేవా అన్నది అటుంచితే, ఆదివారం ఆరంభమైన విధ్వంసకాండ ఆమె బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా కొనసాగితే మమతకు అప్రదిష్ట తప్పదు. ఎన్నికలు జరుగుతున్న కాలంలోనూ రాష్ట్రం పలు హింసాత్మక ఘటనలను చూసింది. పోలింగ్‌ సందర్భంలో కొందరు తృణమూల్‌ కార్యకర్తలను కేంద్రబలగాలు కాల్చిచంపిన ఘటన దేశాన్నే నివ్వెరపరచింది. బీజేపీయే హింసకు పాల్పడి నేరం తృణమూల్‌పైకి నెడుతున్నదని పలు సందర్భాల్లో మమత విమర్శించారు కూడా. 


బెంగాల్‌లో మారణకాండ సాగిపోతున్నదనీ, హత్యలూ, అత్యాచారాలు జరిగిపోతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ఏవేవో విడియోలు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ మహిళాకార్యకర్తలు అత్యాచారానికి గురైనట్టుగా బెంగాల్‌ పోలీసుల పేరుతో కొన్ని పోస్టులు సైతం ప్రత్యక్షమైనాయి. వీటిలో అనేకం నకిలీ అని కొన్ని వెబ్‌సైట్లు నిర్థారిస్తున్నాయి. మతపరమైన ఊచకోతలు సాగుతున్నాయన్న ప్రచారంలోనూ నిజం లేదనీ, బెంగాల్‌లో అనాదిగా ఉన్నది పార్టీపరమైన హింసేనని కొందరు విశ్లేషిస్తున్నారు. బెంగాల్‌ స్థాయిలో కాకున్నా కొంతమేరకు కేరళలోనూ, మిగతా రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పోటాపోటీగానే జరిగినా, ఎన్నికల అనంతర హింస ఎక్కడా లేదు. ఈ హింసను అరికట్టడంతో పాటు, కరోనా నియంత్రణమీద మమత పూర్తి శ్రద్ధపెట్టడం ముఖ్యం. ఆక్సిజన్‌ కోసమో, మరిన్ని టీకాల కోసమే కేంద్రానికి లేఖలు రాయడం, ఇవ్వనందుకు విమర్శలు చేయడం కంటే తన పరిధిలో నిర్దిష్టమైన చర్యలకు నడుంబిగించడం ముఖ్యం. ఎనిమిది విడతల సుదీర్ఘ ఎన్నికల కార్యక్రమంవల్ల రాష్ట్రంలో కరోనా కేసులు కనీసం ఆరురెట్లు పెరిగినట్టు అంచనా. ఉత్తరాదినుంచి బీజేపీ అధినాయకులు పెద్ద సంఖ్యలో ప్రచారానికి వచ్చి రాష్ట్రానికి కరోనా తెచ్చారని విమర్శించిన మమత రాష్ట్రప్రజలకు త్వరితగతిన ఉపశమనాన్ని అందించలేకపోతే అప్రదిష్టపాలవక తప్పదు.

Updated Date - 2021-05-06T06:08:22+05:30 IST