మమత భవనీపూర్ ఎన్నికల ప్రచారం షురూ

ABN , First Publish Date - 2021-09-08T23:07:40+05:30 IST

భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి..

మమత భవనీపూర్ ఎన్నికల ప్రచారం షురూ

కోల్‌కతా: భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు శ్రీకారం చుట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భవనీపూర్ నుంచి మమతాబెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్నారు. టీఎంసీ మద్దతుదారులను ఉద్దేశించి ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనను ఎవరు విమర్శించినా వారిపై వేధింపులకు దిగుతున్నారని అన్నారు. ఉప ఎన్నికల తేదీలు ప్రకటించగానే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు టీఎంసీ నేతలకు సమన్లు పంపినట్టు చెప్పారు. బీజేపీ కుట్ర కారణంగానే నందిగ్రామ్‌లో తాను ఓటమి చవిచూశానని, ఆ కారణంగానే తాను మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలవాల్సి ఉంది.


పోటీకి దూరమన్న కాంగ్రెస్...

కాగా, భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీపై తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు టీఎంసీపై పోటీ కానీ, మమతకు వ్యతిరేకంగా ప్రచారం కానీ కాంగ్రెస్ చేపట్టడం లేదని  బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. మరోవైపు, భవనీపూర్ నియోజకవర్గం నుంచి సీపీఎం నేత శ్రీజిబ్ బిస్వాస్‌ను నిలబెడుతున్నట్టు లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ ప్రకటించింది. భవానీపూర్ నుంచి తమ పార్టీ అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని బీజేపీ తెలిపింది.

Updated Date - 2021-09-08T23:07:40+05:30 IST