హెయిర్ లాస్‌ అవుతోందా? కారణమిదే?

ABN , First Publish Date - 2022-08-25T16:59:51+05:30 IST

నా వయసు ఇరవై. ఈ మధ్య వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయి. కారణం తెలియడం లేదు. ఈ హెయిర్ లాస్‌ను అరికట్టాలంటే ఏం చేయాలి?

హెయిర్ లాస్‌ అవుతోందా? కారణమిదే?

డాక్టర్: నా వయసు ఇరవై. ఈ మధ్య వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయి. కారణం తెలియడం లేదు. ఈ హెయిర్ లాస్‌ను అరికట్టాలంటే ఏం చేయాలి?

-ఓ సోదరి, విశాఖపట్నం


వెంట్రుకల సమస్యలకు ప్రధాన కారణం పోషకాహారలోపం. ప్రతి మహిళలోనూ ఈ లోపం ఎంతో కొంత ఉంటూ ఉంటుంది.  కుటుంబానికంతటికీ తినిపించి, తాము తినడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మహిళలు. దీనికితోడు ప్రతినెలా నెలసరి ద్వారా జరిగే రక్త నష్టం భర్తీ కాదు. ఫలితంగా వాటి ప్రభావం వెంట్రుకల మీద తప్పనిసరిగా పడుతుంది. వెంట్రుకలు పలుచబడడం, ఊడిపోవడం, నిర్జీవంగా తయారవడం లాంటి సమస్యలన్నీ కనిపిస్తాయి.


వెంట్రులు ఊడుతుంటే?

వెంట్రుకలు ఊడటానికి పోషకాహారలోపం ఒక్కటే కారణమైతే, దాన్ని సరిదిద్దితే సమస్య తొలగిపోతుంది. అలా జరగలేదంటే, అందుకు వేరే కారణాలు అయి ఉండొచ్చు. అవేంటంటే... 

వంశపారంపర్య బట్టతల: బట్టతల పురుషులతోపాటు కొందరు స్త్రీలకూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. ఇలాంటి వారికి 18 ఏళ్ల వయసు నుంచీ వెంట్రుకలు ఊడడం మొదలై 35 ఏళ్ల లోపు తల ముందు భాగంలో బట్టతల వచ్చేస్తుంది. 

థైరాయిడ్‌: హైపో, హైపర్‌... రెండు థైరాయిడ్‌ సమస్యల్లోనూ వెంట్రుకలు రాలడం జరుగుతుంది. 

పిసిఒడి: పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ రుగ్మతకు లోనయినప్పుడు హార్మోన్లలో జరిగే అసమతౌల్యం వల్ల వెంట్రుకలు రాలతాయి.

గర్భం: ప్రసవం తర్వాత శరీరంలో పెరిగి తరిగే హార్మోన్లు, తల్లిగా కొత్త బాధ్యతతో ఒత్తిడికి లోనవడం, నిద్ర తగ్గడం వల్ల ఈ దశలో వెంట్రుకలు ఊడొచ్చు. 

హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌: బరువైన విగ్గులు, సవరాలు వాడటం వల్ల వెంట్రుకల మీద ఒత్తిడి పడి ఊడిపోతాయి.

హెయిర్‌ ట్రీట్మెంట్లు: తరచుగా డైయింగ్‌, స్ట్రయిటెనింగ్‌ మొదలైన బ్యూటీ ట్రీట్మెంట్లను వాడుతూ ఉన్నా జుట్టు రాలిపోవచ్చు.

తలలో పుండ్లు: తలలో చుండ్రు పెరిగిపోయి పుండ్లు ఏర్పడినా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల వెంట్రుకలు రాలిపోవచ్చు.

అలొపేసియా: పేను కొరుకుడు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. 

హెయిర్‌ స్టయిల్స్‌: వెంట్రుకలను బిగుతుగా వెనక్కి లాగి కట్టే ‘పోనీ టెయిల్‌’ హెయిర్‌ స్టయిల్‌, వెంట్రుకలను బిగుతుగా పట్టి ఉంచే క్లిప్పుల వల్ల వెంట్రుకలు ఊడతాయి.వంశపారంపర్యంగా సంక్రమించిన బట్టతల మినహా, మిగతా సమస్యలన్నిటినీ కాలంతోపాటు, సమర్ధమైన చికిత్సలతో సరిద్దితే వెంట్రుకలు ఊడడం తగ్గి, తిరిగి చక్కగా పెరుగుతాయి. ఈ కారణాలను సరిదిద్దుకుంటే వెంట్రుకలు రాలే సమస్య సమసిపోతుంది. 


-డాక్టర్‌ ఎ. రవిచందర్‌రావు,

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-08-25T16:59:51+05:30 IST