మరో జలసవ్వడి

ABN , First Publish Date - 2021-08-23T04:56:54+05:30 IST

ఒకప్పుడు చినుకు పడితేనే పంటలు పండేవి, వర్షాలు కురిస్తేనే చెరువులు నిండేవి.. ఇదీ ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ విధానం. జిల్లాలో ఎలాంటి నదులు లేవు. వరద నీటిని ఒడిసిపట్టడానికి వాగుల్లో చెక్‌డ్యాములు నిర్మించినా వర్షాకాలంలో మాత్రమే వాటిలో నీళ్లు ఉండేవి.

మరో జలసవ్వడి
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి చేరుతున్న గోదావరి జలాలు

మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు

50 టీఎంసీల సామర్థ్యమున్న భారీ రిజర్వాయర్‌

ప్రస్తుతానికి 10 టీఎంసీల నీటి నిల్వకు ప్రణాళిక

కొనసాగుతున్న ట్రయల్‌ రన్‌

తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ నుంచి నీటి విడుదల

జిల్లాలో 4 రిజర్వాయర్లకూ జలకళ

తుదిదశలో ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్‌

మొత్తం 5 లక్షల ఎకరాలకు సాగునీరు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 22: ఒకప్పుడు చినుకు పడితేనే పంటలు పండేవి, వర్షాలు కురిస్తేనే చెరువులు నిండేవి.. ఇదీ ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ విధానం. జిల్లాలో ఎలాంటి నదులు లేవు. వరద నీటిని ఒడిసిపట్టడానికి వాగుల్లో చెక్‌డ్యాములు నిర్మించినా వర్షాకాలంలో మాత్రమే వాటిలో నీళ్లు ఉండేవి. ఈ నీటితో పంట పండించుకునే నమ్మకం ఉండేదికాదు. కాలం కలిసిరాక ఎండిపోతున్న పంటలను చూసి ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. సిద్దిపేట జిల్లాకు నలుమూలలా నేడు రిజర్వాయర్లు నిర్మితమయ్యాయి. వర్షంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో నిండుకుండల్లా దర్శనమివ్వడం ఓ అద్భుతమనే చెప్పవచ్చు. రిజర్వాయర్ల నిర్మాణంతో జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. 


తొలిసారి నీటి విడుదల

మల్లన్నసాగర్‌ జలాశయాన్ని 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని 2015లో నిర్ణయించారు. ఇందుకోసం 17వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రతిపాదించారు. 8 గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. కానీ ప్రభుత్వం భూనిర్వాసితులకు భరోసా కల్పించింది. ప్రత్యేక ప్యాకేజీలను అందజేసి, పునరావాసకాలనీలను నిర్మించి ఇచ్చింది. ఎన్నో ఆటుపోట్ల నడుమ ఎట్టకేలకు రిజర్వాయర్‌ నిర్మాణం తుదిదశకు చేరింది. ఒక్కొక్కటిగా ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు. ఈ ఘట్టం శనివారంతో ముగిసింది. ఆదివారం తెల్లవారుజామున తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి గోదావరి జలాలను రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపడమే లక్ష్యంగా ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు.


నిండుకుండల్లా మూడు జలాశయాలు

సిద్దిపేట జిల్లా సరిహద్దులో 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్‌, చిన్నకోడూరు మండలం చందులాపూర్‌లో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్‌, మర్కూక్‌ మండలంలో 15టీఎంసీలు  సామర్థ్యంతో కట్టిన కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకుండల్లా కనువిందు చేస్తున్నాయి. ఈ మూడు రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినవే. గతేడాది ఏప్రిల్‌లో అనంతగిరి, రంగనాయకసాగర్‌లను ప్రారంభించారు. అనంతరం మే నెలలో కొండపోచమ్మసాగర్‌ను ప్రారంభించారు. నాటి నుంచి ఈ రిజర్వాయర్లు జలకళను సంతరించుకుని పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. 


మిగిలింది గౌరవెల్లి రిజర్వాయరే

మెట్టప్రాంతమైన హుస్నాబాద్‌ సమీపంలో 8.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు ప్రస్తుతం తుదిదశకు చేరాయి. జిల్లాలో ఇతర రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నిర్మించగా గౌరవెల్లిపై అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గౌరవెల్లి రిజర్వాయర్‌ గురించి పలు సమీక్షల్లో ప్రస్తావించారు. అదనపు భూసేకరణ కోసం నిధులను విడుదల చేశారు. విదేశాల నుంచి మోటార్లు, పరికరాలు దిగుమతి చేసుకున్నారు. కట్ట నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. భూనిర్వాసితులకు సంబంధించి మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రానున్నది.

Updated Date - 2021-08-23T04:56:54+05:30 IST