మహిళలకు చేయూత

ABN , First Publish Date - 2021-04-17T05:15:07+05:30 IST

స్వశక్తి సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్న మహిళలు ప్రభుత్వం మరింత చేయూతనందించనుంది. ఉత్పత్తి రంగంలోనూ భాగస్వాములను చేస్తూ మహిళా రైతు ఉత్ప త్తిదారుల సంఘాలకు శ్రీకారం చుట్టింది.

మహిళలకు చేయూత

- చేపల ప్రాసెసింగ్‌ కోసం సంఘాల ఏర్పాటు 

- జిల్లాలో కొత్తగా 124 సంఘాలు 

- ఇప్పటికే 9,461 స్వశక్తి సంఘాలు

- సెర్ప్‌ ద్వారా ప్రత్యేక రుణాలు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వశక్తి సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్న మహిళలు ప్రభుత్వం మరింత చేయూతనందించనుంది.  ఉత్పత్తి రంగంలోనూ భాగస్వాములను చేస్తూ మహిళా రైతు ఉత్ప త్తిదారుల సంఘాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళల్లో అవగాహన కల్పిస్తూ ప్రాసెసింగ్‌ కంపెనీల సహకారంతో పంటల ద్వారా వ్యాపార రంగంలోకి తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాను మత్స్య అభివృద్ధికి ఎంపిక చేసింది. దీనికి అనుగుణంగా మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు.  ప్రతీ మండలంలో ఆసక్తి ఉన్న మహిళలతో సంఘాలకు శ్రీకారం చుట్టారు. వీరికి సెర్ప్‌ ద్వారా రుణాలను అందించనున్నారు. జిల్లాలో రెండు కేటగిరీలుగా సంఘాల ఏర్పాటు జరుగుతుంది. ఫిషరీస్‌తోపాటు జనరల్‌ వ్యాపారాలు జరుపుకునే విధంగా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 124 ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిపరిధిలో 2005 మంది సభ్యులను చేర్పించారు. ఉత్పత్తిదారుల సంఘంలో చేరే సభ్యురాలు రూ.100 సభ్యత్వ రుసుము, రూ.500 వాటాధనం చెల్లించాలి. జిల్లాలో ఫిషరీస్‌ రంగానికి సంబంధించి 76  ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1204 మంది సభ్యులు ఉన్నారు. బోయినపల్లిలోని 14 సంఘాల్లో 221 మంది సభ్యులు, చందుర్తిలో ఐదు సంఘాలు 88 మంది సభ్యులు, ఇల్లంతకుంటలో 28 సంఘాలు 438 మంది సభ్యులు, గంభీరావుపేటలో తొమ్మిది సంఘాలు 130 మంది సభ్యులు, రుద్రంగిలో నాలుగు సంఘాలు 76 మంది, తంగళ్లపల్లిలో 2 సంఘాలు 40 మంది, వేములవాడలో నాలుగు సంఘాలు 60 మంది, వేములవాడ రూరల్‌లో 10 సంఘాలు 151 మంది సభ్యులు ఉన్నారు. జనరల్‌ ఉత్పత్తిదారుల సంఘాల్లో ఇల్లంతకుంటలో ఆరు సంఘాల్లో 92 మంది, గంభీరావుపేటలో నాలుగు సంఘాల్లో 62 మంది, కోనరావుపేటలో 12 సంగాళ్లో 211 మంది, ముస్తాబాద్‌లో రెండు సంఘాల్లో 30 మంది, తంగళ్లపల్లిలో 11 సంఘాల్లో 184 మంది, వీర్నపల్లిలో ఐదు సంఘాల్లో 100 మంది, ఎల్లారెడ్డిపేటలో ఎనిమిది సంఘాల్లో 128 మంది సభ్యులను చేర్పించారు. సభ్యుల్లో డైరెక్టర్లను ఎంపిక చేసి జిల్లా సంఘాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళా రైతు ఉత్పత్తి దారుల కంపెనీల ద్వారా సూపర్‌ మార్కెట్‌ వంటి వ్యాపార రంగాలతోపాటు ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా ఆదాయం చేకూరనుంది. వీరికి సెర్ప్‌ ద్వారా రూ .50వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందించనున్నారు. జిల్లాలో ఇప్పటికే మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌ ద్వారా వ్యాపారాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనరల్‌ కేటగిరీ ద్వారా జిల్లాలో 269 కిరాణా దుకాణాలు, 108 ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మహిళా ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మరింత ఆర్థిక  లభించనుంది. 


జిల్లాలో 9461 స్వశక్తి సంఘాలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండల సమాఖ్యలు 399 గ్రామ సంఘాలు ఉండగా 9461 స్వశక్తి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,07,300 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంక్‌ లింకేజీల ద్వారా వడ్డీలేని రుణాలను అందిస్తున్నారు. 2019 - 2020 సంవత్సరంలో 5,233 సంఘాలకు రూ.156.40 కోట్లు, 2020- 2021 సంవత్సరంలో 10,460 సంఘాలకు రూ. 248 కోట్లు రుణాలు అందించారు. స్త్రీనిధి ద్వారా 2019 -2020లో రూ.50.91 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.46.53 కోట్ల రుణాలను అందించారు. మహిళా సంఘాలు ఇప్పటికే ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న క్రమంలో స్వశక్తి ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా మరింత ఆర్థిక చేయూత అందనుంది.


Updated Date - 2021-04-17T05:15:07+05:30 IST