Water crisis in Dindori : నీళ్ల కోసం రిస్క్‌లో ప్రాణాలు.. బావిలోకి దిగుతున్న మహిళలు..

ABN , First Publish Date - 2022-06-03T19:36:29+05:30 IST

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. అసలే వేసవికాలం కావడంతో పలు ప్రాంతాల జనాలు

Water crisis in Dindori : నీళ్ల కోసం రిస్క్‌లో ప్రాణాలు.. బావిలోకి దిగుతున్న మహిళలు..

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. అసలే వేసవికాలమవ్వడంతో కొన్ని ప్రాంతాల జనాలు నీరు దొరక్క విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా  గిరిజన జిల్లా డిండోరిలో పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. తీవ్ర పరిస్థితులకు అద్దంపట్టే ఓ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు మోసుకురావడం చూశాం.. కానీ డిండోరిలోని ఓ గ్రామానికి చెందిన మహిళలు నీళ్ల కోసం ప్రాణాలను సైతం ప్రమాదపు అంచున నిలపాల్సి  వస్తోంది. నీళ్ల సేకరించే క్రమంలో మహిళలు బావిలోకి దిగాల్సి వస్తోంది. ఓ మహిళ బావిలోకి దిగి నీటిని  తోడుతున్న దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో అక్కడి తీవ్ర నీటి కరువును కళ్లకు కట్టినట్టు చూపుతోంది.


నీటి తీవ్ర పరిస్థితులపై డిండోరి గ్రామానికి చెందిన ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు అడగడానికి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు(రాజకీయనాయకులు) ఓట్ల కోసమే వస్తారు. లేకపోతే అసలు రారు. తమకు సరైన నీటి సప్లయ్ చేయకుంటే ఈసారి ఓట్లు వేయబోమని హెచ్చరించింది. మమ్మల్ని పట్టించుకోకపోతే తగిన బుద్ధిచెబుతామని తెగేసి చెప్పింది. వేసవితాపం గరిష్ఠ స్థాయిలో ఉండడంతో గ్రామంలో ఉన్న మూడు బావులు కూడా ఎండిపోయాయి. గ్రామంలో కనీసం హ్యాండ్‌ పంప్స్ ద్వారా నీటి సప్లయ్ కూడా లేదని ఆమె వాపోయింది. 


శ్రద్ధచూపని యంత్రాంగం..

ఇదివరకు మధ్యప్రదేశ్ యూఏడీ(అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్) కనీసం 70 మునిసిపాలిటీల్లో 2-3 రోజులకోసారి నీటి సప్లయ్ చేసేది. ప్రస్తుతం అలాంటి సేవలు అందించడం లేదు. దీంతో నీటి కోసం అక్కడి ప్రజలు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఉజ్జయిన్, భోపాల్, గ్వాలియర్, జబల్‌పూర్, ఇండోర్, రెవా ప్రాంతాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తకుండా వ్యవహరించడంపై గత నెల్లో ఉన్నత స్థాయి మీటింగ్ కూడా జరిగింది. అయినప్పటికీ కార్యచరణ సరైన రీతిలో జరగలేదు.


కాగా నీటి కరువు కేవలం మధ్యప్రదేశ్‌లోని గ్రామాలకే మాత్రమే పరిమితం కాలేదు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్ కూడా తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే మీర్జాపూర్‌లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన నీటి కరువును ఎదుర్కొన్నారు.



Updated Date - 2022-06-03T19:36:29+05:30 IST