మగువా నీకు వందనం..!

ABN , First Publish Date - 2021-03-08T05:29:01+05:30 IST

తెగువ, గొప్పదనంలో సింహపురం మగువలు కూడా ముందు నిలస్తుండడం విశేషం.

మగువా నీకు వందనం..!

అన్ని రంగాల్లో నేడు ముందంజ

మగవారికి తీసిపోని విధంగా రాణింపు

ఆమె ప్రతిభ అనన్యసామాన్యం


తల్లిగా.. భార్యగా.. అక్కగా.. చెల్లిగా.. బిడ్డగా.. స్నేహితురాలిగా.. ఇలా పలు విధాలుగా మగువ తన జీవితంలో నడుస్తూ సమస్త మానవాళిని నడిపిస్తున్న తీరు వర్ణణాతీతం. ఎక్కడో బయటకు కనపడడానికే కష్టంగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అన్నింటికీ ముందుండి నడిపించే స్థాయికి మహిళ చేరుకోవడం గొప్ప పరిణామం. ‘ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లకు చెప్పండి.. ఏదైనా చేయాలను కుంటే మాత్రం ఆడవాళ్లను అడగండి..’ అని ప్రపంచ మేధావులు కీర్తించారంటే మానవ జీవితంలో మహిళల పాత్ర ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశానికి రాజైనా ఓ తల్లికి బిడ్డేగా.. అన్న మాటలు అమ్మ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాయి. నేడు ఆ రంగం.. ఈ రంగం... అన్న తేడా లేదు. ప్రపంచంలో పురుషులు చేసే ప్రతి పనిని మహిళలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు.


 తెగువ, గొప్పదనంలో సింహపురం మగువలు కూడా ముందు నిలస్తుండడం విశేషం. జిల్లాకు చెందిన అనేక మంది రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో రాణించారు. ఉన్నత ఉద్యోగాల్లో కూడా రాణిస్తున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో కూడా జిల్లా మహిళల పాత్ర తక్కువేమీ కాదు. ఓ వైపు కుటుంబం, మరో వైపు ఉద్యోగ, వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమానికి పూనుకొని ముందుండి నడిపించి సారాను నిషేధించేలా చేసిన సింహపురి మహిళాలోకాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మగువ జీవితం నుంచి ప్రతీదీ నేర్చుకోదగినదేనంటే అతిశయోక్తి కాదేమో..! సోమవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళలు ఎవరేమన్నారంటే...

-- నెల్లూరు, ఆంధ్రజ్యోతి


ప్రొత్సహిస్తే మహిళలు రాణిస్తారు..: డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి 

మహిళలను ప్రొత్సహిస్తే అన్నీ రంగాలలో రాణిస్తారు. విద్యార్ధి దశలో తల్లీతండ్రి ప్రోత్సాహించారు. ప్రత్యేకించి తండ్రి ప్రోత్సాహం మరువ లేనిది.  ఉద్యోగ బాధ్యతలో భర్త ప్రోత్సాహం కూడా మరువలేనిదే. అందుకే వైద్య ఆరోగ్యశా ఖపై పూర్తి దృష్టి పెట్టగలుగుతున్నా. ఒక్కోసారి ఇంటికి వెళ్లేటప్పటికి రాత్రి 2 గంటలు కూడా అవుతుంది. ఇంత ఒత్తిడిలోనూ కుటుంబ సభ్యులు సహకారం మరువ లేనిది.  ఇద్దరు మగపిల్లలకు కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేశా. కోడళ్లనే కూతుర్లుగా చూసుకుంటూ కుమార్తెలు లేని లోటును తీర్చుకుంటున్నా. మహిళలను ప్రోత్సాహిస్తే ఎంతటి స్ధాయికైనా ఎదుగుతారని విశ్వసిస్తున్నా. 


తల్లిదండ్రుల పోత్సాహంతోనే ఉన్నతస్థాయికి..: డిప్యూటీ కలెక్టర్‌ కేఎం రోజ్‌మాండ్‌

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివా. ఉన్నత ఉద్యోగాన్ని సాధించా.  జిల్లాలో 19 ఏళ్లపాటు తహసీల్దార్‌గా, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశా. సివిల్‌సప్లయిస్‌ విజిలెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, సివిల్‌ పప్లయిస్‌ డీఎంగా, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా, డీఆర్‌డీఏ పీడీగా, జేసీ(ఆసరా)గా వివిధ హోదాలలో పనిచేశా. జన్మనిచ్చిన తల్లి కృప, తండ్రి జోసెఫ్‌లు తననెంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఉపాధ్యాయులైన వారు తనకు మంచి క్రమశిక్షణను కూడా నేర్పారు. ఇంటి నుంచే క్రమశిక్షణతో పెరిగిన తనను, ఎంత చదివినా చదివిస్తామని వారు పోత్సాహించారు. అందువల్లే తాను ఈ స్థాయికి చేరా. ప్రతి మహిళ చదువుకోవాలి. చదువే తన ఆస్తిగా భావించాలి. అన్నీ రంగాలలో ధైర్యంగా రాణించాలి.


 కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలి.. : డీపీవో ధనలక్ష్మి

 మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలి. మగవారికి దీటుగా క్రీడలు, రాజకీయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలతోపాటు అంతరిక్ష ప్రయోగాల్లోనూ మహిళల పాత్ర ఎంతగానో పెరుగుతుండ డం మహిళా లోకానికి గర్వకారణం. దీనంతటికి ప్రధానంగా కుటుంబ సభ్యుల పోత్రాహమే కారణం. తాను కూడా జిల్లా స్థాయి అధికారి స్థానంలో ప్రస్తుతం రాణిస్తున్నానంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణం.  తల్లి, తండ్రి, భర్త, సోదరుల ప్రోత్సాహం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు.  

Updated Date - 2021-03-08T05:29:01+05:30 IST