కర్ణాటకతో సరిహద్దు వివాదాన్ని మళ్లీ లేవనెత్తిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-05-01T16:14:22+05:30 IST

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా, లౌడ్‌స్పీకర్ల వివాదాలు కొనసాగుతుండగానే

కర్ణాటకతో సరిహద్దు వివాదాన్ని మళ్లీ లేవనెత్తిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ముంబై : మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా, లౌడ్‌స్పీకర్ల వివాదాలు కొనసాగుతుండగానే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరో వివాదానికి తెర తీశారు. మహారాష్ట్ర దినోత్సవాల సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ, మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న గ్రామాలు ఇప్పటికీ మహారాష్ట్రలో భాగం కాకపోవడం శోచనీయమని చెప్పారు. 


‘‘మహారాష్ట్ర దినోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో కూడా ఇప్పటికీ మనం విచారిస్తున్నాం. బెల్గాం, కర్వార్ సహా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మరాఠీ మాట్లాడే ప్రజలు గల గ్రామాలు మన రాష్ట్రంలో భాగం కాకపోవడం పట్ల మనం ఇప్పటికీ విచారిస్తున్నాం. ఈ గ్రామాల ప్రజలు మహారాష్ట్రలో భాగం కావడం కోసం జరిపే పోరాటాలకు మద్దతిస్తామని హామీ ఇస్తున్నాను’’ అని అజిత్ పవార్ చెప్పారు. 


ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెల్గాం, కర్వార్ వంటి ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారని మహారాష్ట్ర చెప్తోంది. ఈ గ్రామాలను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ప్రాంతాలు తమ రాష్ట్రంలో అంతర్బాగమని కర్ణాటక వాదిస్తోంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956లో ఈ వివాదానికి మూలాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వివాదంపై ఇరు రాష్ట్రాల నేతలు ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. గత డిసెంబరులో కూడా హింసాత్మక సంఘటనలు జరగడంతో కఠినమైన ఆంక్షలను అమలు చేశారు. 


బెల్గాం జిల్లాను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన గతంలో డిమాండ్ చేసింది. ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’లో రాసిన వ్యాసంలో ఈ డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే.


Updated Date - 2022-05-01T16:14:22+05:30 IST