Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మహాజోష్‌

twitter-iconwatsapp-iconfb-icon

ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి

నేడు ప్రతినిధుల, రేపు బహిరంగ సభ

తుది పరిశీలన చేసిన అచ్చెన్న ఇతర నేతలు

ఒంగోలు చేరిన చంద్రబాబు, లోకేష్‌

మహానాడు కార్యక్రమాలపై పొలిట్‌బ్యూరో భేటి

పసుపుమయంగా మారిన ఒంగోలు

ఉరిమే ఉత్సాహంలో తెలుగు తమ్ముళ్లు

ఒంగోలులోబాబు, ముఖ్యనేతలు, 

టంగుటూరులో బాలకృష్ణ, లోకేష్‌ బస

కల్యాణమండపాలు, హోటళ్లు, లాడ్జీలలో ప్రతినిధులకు వసతి

ఒంగోలు, మే 26 (ఆంధ్రజ్యోతి): 

తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. శుక్ర, శనివారాల్లో రెండురోజుల పాటు ఒంగోలు వేదికగా మహానాడు జరగనుండగా నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ప్రత్యేకంగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 80 ఎకరాల్లో మహానాడు సభలు ఇతర కార్యక్రమాలకు మరో 50 ఎకరాల్లో పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేశారు. తొలిరోజైన 27న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర పలు దేశాల నుంచి వచ్చే 12వేలమందికిపైగా ఎంపిక చేసిన ప్రతినిధులతో ప్రత్యేకంగా ప్రతినిధులసభ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకధాటిగా ప్రతినిధుల సభ జరగనుండగా టీడీపీ భవిష్యత్‌ రాజకీయ వ్యూహంపై తీర్మానంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాలనతో వివిధవర్గాల ప్రజలపై మోపుతున్న భారాలు,దాడులు, శాంతిభద్రతలు, ప్రజారోగ్యం ప్రస్తుత ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చలు, తీర్మానాలు చేయనున్నారు. అలాగే ఈసారి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీరామారావు శతజయంతి కావడం, పార్టీ ఆవిర్భావం జరిగి 40ఏళ్ళు పూర్తి నేపథ్యంలో పార్టీ చరిత్ర, ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర, సాధించిన విజయాలు వివిధ ఘట్టాలతో ప్రత్యేకంగా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎప్పటిలాగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 


లక్షమందితో భారీ సభ

తొలిరోజు ఇలా కార్యక్రమాలు ఉండగా రెండవరోజైన 28న ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా తరలివచ్చే లక్షమంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతినిధుల సభ, రెండవరోజు బహిరంగ సభలు ఒకే ప్రాంగణంలో అదే వేదికపై జరగనుండగా అందుకు వీలుగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. 450మంది కూర్చున్నా ఇబ్బందిలేకుండా ఉండేలా సభావేదికను ఏర్పాటుచేయగా అధినేతతోపాటు పొలిట్‌బ్యూరో సభ్యులు వివిధ బాధ్యతల్లో ఉండే రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీ స్థాయి నేతలను వేదికపై అనుమతిస్తున్నట్లు సమాచారం. అలాగే సభావేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 12వేల మంది ప్రతినిధులు కూర్చొనేలా ప్రాంగణంలో బ్లాకుల వారీ విభజించి కుర్చీలు వేయడంతో పాటు ఎండల తీవ్రత నేపథ్యంలో అటు వేదికపైనా, ఇటు ప్రతినిధులు కూర్చొనే బ్లాకుల్లోనూ ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై కార్యక్రమాలు చివరి వరుసలో ప్రతినిధులకు కూడా కనిపించేలా 20 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటుచేశారు. 


12 వేలమందితో ప్రతినిధుల సభ

అటు సభావేదికపైనా ఇటు ప్రతినిధులు కూర్చొనే బ్లాకులు వాటి పక్కనే ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరం, మీడియా సెంటర్‌, వీఐపీల భోజనాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక రూములు సిద్ధమయ్యాయి. ప్రతినిధుల ప్రాంగణంలోకి వచ్చేమార్గంలో పార్లమెంట్‌ స్థానానికి ఒక కౌంటర్‌ చొప్పున ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎంపిక చేసిన ప్రతినిధులు అక్కడే తమ పేర్లు నమోదు చేసుకునేలా గుడారాలు ఏర్పాటుచేశారు. ప్రతినిధులు 12వేలమంది అయినప్పటికి దాదాపు 25 నుంచి 30వేలమందికి ఇబ్బందిలేకుండా భోజనాలు తొలిరోజున ఏర్పాటు చేస్తున్నారు. పాతిక వరకు ప్రత్యేకంగా బఫే స్టాల్స్‌ను పెట్టారు. అలాగే ఎండల తీవ్రత నేపథ్యంలో వాటర్‌బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేయనున్నారు. ప్రాంగణ సమీపంలో బయో టాయిలెట్లు ఏర్పాటుచేశారు. 


భారీగా నేతల పరిశీలన

మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు గురువారం సాయంత్రానికి పూర్తికాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అచ్చెన్నాయుడు, మధ్యాహ్న సమయంలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ స్వామి, సత్యప్రసాద్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు జిల్లాకు చెందిన  నేతలు ఉగ్రనరసింహారెడ్డి, నూకసాని బాలాజీ, దామచర్ల సత్య, సాయికల్పనారెడ్డి, ఎరిక్షన్‌బాబు తదితరులతో కలిసి ప్రాంగణంలో పర్యటించి పలు సూచనలు చేశారు. పెద్దసంఖ్యలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు, ఇతర ప్రాంతాల వారు గురువారమే ప్రాంగణం వద్దకు చూసేందుకు రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కాగా వారందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి చిన్నరాజప్ప, ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ల నేతృత్వంలో భోజన శాలను అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సందర్శించి ప్రారంభించారు. 


వేలాది మందికి వసతి

కాగా మహానాడుకు వేలాదిగా ప్రతినిధులు వస్తుండగా ఆ స్థాయిలో వసతి  సౌకర్యాలు ఒంగోలులో అందుబాటులో లేకపోవడంతో అటు విజయవాడ, గుంటూరు, ఇటు చీరాల, బాపట్ల తీరప్రాంతాలు, దక్షిణవైపున ఉన్న నెల్లూరు, కావలి ప్రాంతాల్లో జిల్లానేతలు బస ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో ఒంగోలులోని ప్రధాన హోటళ్లు, లాడ్జిలు, ప్రైవేటు అతిథిగృహాలు, ఫంక్షన్‌ హాల్స్‌, కల్యాణ మండపాలను ముందుగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య రిజర్వు చేసి రాష్ట్ర పార్టీ వసతుల కమిటీకి అందజేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నగరంలోని ఎన్నెస్పీ అతిథి గృహంలో బస చేయనుండగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు టంగుటూరులో బస చేయనున్నారు. ఇక పొలిట్‌బ్యూరో సభ్యులు, వివిధస్థాయిల్లోని రాష్ట్ర నేతలకు ఒంగోలులోని ప్రధాన హోటళ్లు, లాడ్జిలలో బస ఏర్పాటు చేయగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులకు కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాల్స్‌ను కేటాయించారు. అలాగే టీడీపీలో కీలక యువనేతలుగా గుర్తింపు ఉన్న శ్రీకాకుళ ం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పరిటాల శ్రీరామ్‌, చింతకాయల విజయ్‌, పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌, దివంగత బాలయోగి తనయుడు హరీష్‌ తదితర డజను మందికి పైగా నేతలకు కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్‌లో బస ఏర్పాటు చేసినట్లు సమాచారం.


నగరం పసుపుమయం

మహానాడు నేపథ్యంలో ఇటు ఒంగోలు నగరం, అటు కార్యక్రమాలు జరిగే ప్రాంగణప్రాంతం పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణంలోని ప్రతినిధుల సభ, ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాల బ్లాక్‌లతోపాటు భోజనశాల అన్నింటిని పసుపు వస్ర్తాలు, జెండాలతో అలంకరించారు. ప్రాంగణంలో చంద్రబాబు, లోకే్‌షల ఫొటోలతో కూడిన బెలూన్లు ఎగురుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలువగా ప్రాంగణంలోకి వెళ్ళే దారిలోని జాతీయరహదారిపైనా ప్రాంగణం లోపల కటౌట్లు, ఫ్లెక్సీలు నిండిపోయాయి. ఇక ఒంగోలులో ఎటుచూసినా పసుపుమయంగా మారింది. ప్రధాన కూడళ్లు, వీధులు, పాతబైపాస్‌ రోడ్డుమార్గాల్లో దారిపొడవునా పసుపుతోరణాలు టీడీపీ జెండాలు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు భారీగా కనిపిస్తున్నాయి. 


ఒకరోజు ముందుగానే బాబు, లోకేష్‌ రాక

28న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి చంద్రబాబు ప్రారంభించనుండగా అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మహానాడులో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే గురువారం సాయంత్రానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్‌ ఇతర ముఖ్యనేతలు ఒంగోలు చేరుకోగా స్థానిక సరోవర్‌ హోటల్‌లో పొలిట్‌బ్యూరో సమావేశమై మహానాడు కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కాగా ఉమ్మడి జిల్లా సరిహద్దు నుంచి చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికి భారీ బైక్‌ర్యాలీతో ఒంగోలు తీసుకొచ్చారు. 


మహాజోష్‌పసుపుమయంగా మారిన ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.