కరోనా ఎఫెక్ట్: నేరుగా మండలికి ఉద్ధవ్ థాకరే?

ABN , First Publish Date - 2020-04-09T19:48:31+05:30 IST

కరోనా వైరస్ కారణంగా మండలి ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని ఎమ్మెల్సీగా నియమించాలంటూ...

కరోనా ఎఫెక్ట్: నేరుగా మండలికి ఉద్ధవ్ థాకరే?

ముంబై: కరోనా వైరస్ కారణంగా శాసన మండలి ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని ఎమ్మెల్సీగా నియమించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. మండలిలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు సీఎం పేరును సిఫారసు చేస్తూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తీర్మానం సమర్పించింది. సీఎం ఉద్ధవ్ థాకరేకి ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలోగానీ, మండలిలోగానీ సభ్యుత్వం లేదన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో శివసేన పార్టీ బీజేపీకి దూరం జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పీఠమెక్కిన ఆరు నెలల్లోగా శాసన సభకు, లేదా మండలికి ఎన్నిక కావాల్సి ఉండడం.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను ఆశ్రయించినట్టు కనిపిస్తోంది.


‘‘ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సీఎం ఉద్ధవ్ థాకరే పేరును గవర్నర్‌కు సిఫారసు చేస్తూ ఇవాళ మంత్రి మండలి తీర్మానం చేసింది. కోవిడ్-19 కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం..’’ అని మంత్రి నవాబ్ మలిక్ పేర్కొన్నారు. కాగా రాజకీయాల్లోకి వచ్చింది మొదలు  ఇప్పటి వరకు ఉద్ధవ్ థాకరే ఒక్కసారిగా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. శివసేన పార్టీని వెనుక ఉండి నడిపించేందుకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. 

Updated Date - 2020-04-09T19:48:31+05:30 IST