మాఫియాలకు అడ్డాగా రాష్ట్రం

ABN , First Publish Date - 2021-03-07T06:08:45+05:30 IST

రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా, బ్రోకర్లు, రౌడీలు, దౌర్జన్యాలు పెరిగాయని, మాఫియాకు అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

మాఫియాలకు అడ్డాగా రాష్ట్రం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేసీఆర్‌, ఓవైసీ ఒకే ప్లేట్‌లో బిర్యానీ తినేటోళ్లు 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

రామగిరి, మార్చి 6: రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా, బ్రోకర్లు, రౌడీలు, దౌర్జన్యాలు పెరిగాయని, మాఫియాకు అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ గెలుపును కాంక్షిస్తూ పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు న్యాయవాదులైన వామనరావు దంపతులను నడిరోడ్డుపై పట్టపగలు చంపడంచూస్తే రౌడీ రాజ్యంగా మారిందనడానికి ఇంతకంటే రుజువేం కావాలన్నారు. రాష్ట్రంలో కవులు, ఉద్యోగులను, నిరుద్యోగులను, మేధావులను, డాక్టర్లను, రైతులను ఇలా ప్రతీ ఒక్కరిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలనే దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టంకట్టారన్నారు. జీహెచ్‌ఎంసీలో నాలుగు స్థానాలున్న బీజేపీ 48 స్థానాలకు ఎగబాకిందంటే ప్రజల్లో టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత ఎంత ఉందో చెప్పాల్సిన పనిలేదన్నారు. జీహెచ్‌ఎంసీ దెబ్బకు ఎల్‌ఆర్‌ఎ్‌సను ఎత్తివేశారన్నారు. దీంతో సాగర్‌ నియోజకవర్గంలో నోటిఫికేషన్‌ రాకముందే సమావేశం నిర్వహించి హామీల వర్షం కురిపించినా ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్‌ 70 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి మోదీ ఐదేళ్లలో చేసిచూపించారన్నారు. రూ.17వేల కోట్లతో 350 కిలోమీటర్లలో రీజినల్‌ రింగ్‌రోడ్డుకు ప్రధాన మంత్రి ఈ రోజే సంతకం చేశారని, రేపటి నుంచే భూసేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు శాసిస్తున్నాయని ఒకటి కల్వకుంట్ల కుటుంబం అయితే, రెండోది ఓవైసీ కుటుంబం అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏడేళ్లకాలంలో ఆరుమార్లే సచివాలయానికి వచ్చారని, సచివాలయంలో జరగాల్సిన నిర్ణయాలన్నీ కేసీఆర్‌ డైనింగ్‌ టేబుల్‌ మీదే జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రెండోదశ నిలిచేందుకు కారణమేంటో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, నాయకులు మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌, పెద్దిరెడ్డి, ఎన్నం శ్రీనివా్‌సరెడ్డి, వెంకట్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్‌, గోలి మధుసూదన్‌రెడ్డి, ఓరుగంటి రాములు, వీరెళ్లి చంద్రశేఖర్‌, బండారు ప్రసాద్‌, మొరిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T06:08:45+05:30 IST