మద్యం దుకాణాలకు నో కర్ఫ్యూ..!

ABN , First Publish Date - 2021-05-17T06:38:24+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ పాటించనున్నట్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.

మద్యం దుకాణాలకు నో కర్ఫ్యూ..!

యథేచ్ఛగా విక్రయాలు

మందుబాబులకు మాత్రం పోలీసుల జరిమానాలు

ఉత్తర్వులు లేవంటున్న ఎక్సైజ్‌ శాఖాధికారులు

ఇతర వ్యాపారుల మండిపాటు


అనంతపురం క్రైం, మే16: జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ పాటించనున్నట్లు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. షాపు తెరిచినా, బయట జనం కనిపించినా.. పోలీసులు జరిమానాలు విధించారు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలు మాత్రం మూతపడలేదు. ఆదివారం కూడా విక్రయాలు సాగించటంపై అందరూ ముక్కున వేలేసుకున్నారు. జనం ప్రాణాలు పోతుంటే మద్యం విక్రయాలు అవసరమా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. విచిత్రమేమిటంటే మద్యం దుకాణాలు తెరిచినా.. మందు కోసం వెళ్లే మద్యం ప్రియులకు మాత్రం పోలీసులు జరిమానాలు విధించారు.

జిల్లాలో కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాల్లో పోలీసులు.. ఎక్సైజ్‌ శాఖాధికారులు వింత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మద్యం దుకాణాలకు ఒక నిబంధనలు.. ఇతర షాపులకు మరో నిబంధనలు అమలు చేస్తున్నారు. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు స్వచ్ఛందంగా దుకాణాలు, షాపులు తదితర వ్యాపార సముదాయాలు ఆదివారం మూసివేశారు. ఇదే క్రమంలో కొన్ని దుకాణాలు, షాపులు వ్యాపారాలు సాగిస్తుంటే.. పోలీసులు కొరడా ఝుళిపించేస్తున్నారు. వాటిని మూసివేయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అదేశాలు రాకపోయినా.. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధుల నిర్ణయంతోనే ఎక్కడికక్కడ పోలీసులు దుకాణాలను మూసివేయించారు. ఆదివారం నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరిచి, ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేస్తున్నా.. పోలీసులు.. ఎక్సైజ్‌ శాఖాధికారులు మూత వేయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదేమని అడిగితే.. పోలీసులు, ఎక్సైజ్‌ శాఖాధికారులు తమకు అదేశాలు జారీ కాలేదని చెబుతున్నారు. పైగా అవన్నీ కూడా ప్రభుత్వ దుకాణాలు కదా..? అని చేతులు దులుపుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. నగరంలో కరోనా కట్టడి కంటే మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయమే తమకు ముఖ్యమన్న చందంగా జిల్లాలో పరిస్థితి ఉండటం విమర్శలకు తావిస్తోంది.

మద్యం కోసం వస్తే జరిమానాలేంటి?

జిల్లావ్యాప్తంగా ఆదివారం దుకాణాలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. మద్యం దుకాణాలకు మాత్రం తెరిచారు. దీంతో మద్యం బాబులు.. ఆయా దుకాణాల వద్దకు రాక తప్పలేదు. పూర్తి కర్ఫ్యూ నేపథ్యంలో అనవసరంగా బయటకు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మద్యం కోసం దుకాణాలకు మద్యం కొనుగోలుదారులు వస్తుంటే ఎందుకు బయటకు వచ్చావ్‌ అంటూ పోలీసులు జరిమానాలు విధించడం గమనార్హం. కొందరు మద్యంబాబులైతే మద్యం దుకాణాలు ఎందుకు తెరిచారని పోలీసులను ప్రశ్నించారు.


వ్యాపారుల మండిపాటు

జిల్లావ్యాప్తంగా వ్యాపార సముదాయాలు మూసివేసి, కొవిడ్‌ కట్టడికి కృషి చేస్తుంటే.. ప్రభుత్వ దుకాణాలు మాత్రం తెరిచి విక్రయాలు సాగిస్తుండటంపై కొందరు వ్యాపారులు మండిపడుతున్నారు. మద్యం విక్రయాలు ముఖ్యమా..? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా..? అన్నది ఎక్సైజ్‌ శాఖ, పోలీసులు ఆలోచించకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే మద్యం దుకాణాలు మూసివేయకుండా వ్యాపారులు చేయడాన్ని తప్పుబట్టారు. మద్యం దుకాణాల వద్ద మద్యం బాబులు భౌతికదూరం కూడా పాటించడం లేదు. కొందరైతే మాస్కు కూడా ధరించకపోవడం నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మద్యం దుకాణాలు తెరిచి, విక్రయాలు సాగించడాన్ని ప్రతిఒక్కరూ తప్పు పడుతున్నారు.


Updated Date - 2021-05-17T06:38:24+05:30 IST