పాలను గాజు సీసాల్లో ఎందుకు విక్రయించకూడదు?

ABN , First Publish Date - 2022-04-23T14:54:30+05:30 IST

ఒకవైపు ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో ప్లాస్టిక్‌ సంచుల్ని వినియోగించడం ఎంత వరకు సబబో చెప్పాలని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. రేషన్‌ దుకాణాల్లో

పాలను గాజు సీసాల్లో ఎందుకు విక్రయించకూడదు?

- పాలకులే ఆచరణలో పెట్టండి

- మీరే నిషేధం అమలు చేస్తూ.. ప్లాస్టిక్‌ వినియోగిస్తే ఎలా?

- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు


చెన్నై: ఒకవైపు ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో ప్లాస్టిక్‌ సంచుల్ని వినియోగించడం ఎంత వరకు సబబో చెప్పాలని మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. రేషన్‌ దుకాణాల్లో ప్లాస్టిక్‌ సంచుల్లో నిత్యావసర వస్తువులు పెట్టి, పచ్చ సంచుల్లో తరలించినంత మాత్రాన కలిగే ప్రయోజనమేముందని ప్రశ్నించింది. ప్రభుత్వ డైరీ విక్రయిస్తున్న పాలు ప్లాస్టిక్‌ కవర్లలోనే సరఫరా అవుతున్నాయని, మరి ప్లాస్టిక్‌ నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెబుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గతంలో మాదిరిగా పాలను గాజు సీసాలో ఎందుకు సరఫరా చేయకూడదో చెప్పాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వైద్యనాధన్‌, జస్టిస్‌ ఆషాతో కూడిన ధర్మాసనం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధిస్తూ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలంటూ తమిళనాడు, పుదుచ్చేరి ప్లాస్టిక్‌ ఉత్పత్తదారుల సంఘం అప్పీలు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ముందు విచారణ జరగ్గా.. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు చేపట్టిన చర్యలు, ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించే దుకాణాలపై తీసుకుంటున్న చర్యలు తదితరాలపై  ప్రభుత్వ న్యాయవాది అఫిడివిట్‌ దాఖలుచేశారు. ఆహార పదార్ధాలు, రెడీమెడ్‌ దుస్తులను ప్లాస్టిక్‌ సంచుల్లో  విక్రయిస్తున్నారని, తాజాగా ప్రభుత్వం అందిస్తున్న పసుపు సంచులను కూడా ప్లాస్టిక్‌ సంచుల్లోనే ఉంచి విక్రయిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. రాష్ట్రం లో పాస్టిక్‌ ఉత్పత్తిదారులను అధికారులు వేధిస్తున్నారని, పొరుగు రాష్ట్రాల నుంచి యధేచ్చగా దిగుమతవుతున్నాయని తెలిపారు. 


రెండు వేళ్ల విధానాన్ని సత్వరం నిషేధించండి

అత్యాచారానికి గురైన బాలికలకు నిర్వహించే రెండు వేళ్ల పరీక్షా విధానాన్ని సత్వరం నిషేధించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది. అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న పుదుకోట జిల్లాకు చెందిన రాజీవ్‌.. తనకు పడిన శిక్షపై హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుబ్రమణియన్‌, జస్టిస్‌ సతీష్ కుమార్‌లతో కూడిన మదురై ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుతరఫు వాదనల సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. అత్యాచారానికి గురైన బాలికలకు వైద్యులు రెండు వేళ్ల పరీక్షలు చేయడం సాధారణమైపోయిందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిశోధనలు రాజ్యాంగానికి విరుద్దమని అభిప్రాయపడింది. పలు రాష్ట్రాలు అత్యాచార బాధితులకు రెండు వేళ్ల పరీక్షలను నిషేధించాయని గుర్తు చేస్తూ.. ఇక్కడా వాటిని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Updated Date - 2022-04-23T14:54:30+05:30 IST