High Court: నాలుగు నెలల్లో ‘ఆర్డర్లీ’ వ్యవస్థను రద్దు చేయండి

ABN , First Publish Date - 2022-08-24T14:19:48+05:30 IST

రాష్ట్రంలో నాలుగు నెలల్లోగా ఆర్డర్లీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని పోలీసుశాఖను మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) ఆదేశించింది. అంతేగాక

High Court: నాలుగు నెలల్లో ‘ఆర్డర్లీ’ వ్యవస్థను రద్దు చేయండి

                                         - ఆదేశించిన హైకోర్టు 


చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు నెలల్లోగా ఆర్డర్లీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని పోలీసుశాఖను మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) ఆదేశించింది. అంతేగాక అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులకు సహాయకులు, ఇంటి పనిమనుషులను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించవచ్చని కూడా స్పష్టం చేసింది. ఇకపై ఏ పోలీసు ఉన్నతాధికారి వద్దా కానిస్టేబుళ్లు పనిమనుషులుగా ఉండకూడదని తేల్చి చెప్పింది. కానిస్టేబుళ్లు(Constables) పోలీసుశాఖకు సంబంధించిన విఽధి నిర్వహణకే పరిమితం కావాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని పోలీసు క్వార్టర్స్‌(Police quarters)లో ఓ ఉన్నతాధికారి వద్ద ఆర్డర్లీగా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ డి.మాణిక్యవేల్‌ తన ప్లాటు ఖాళీ చేయాలంటూ ఇచ్చిన నోటీసును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం.. ఇంకా ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగుతున్న విషయాన్ని గ్రహించి దిగ్ర్భాంతి చెందిన విషయం తెలిసిందే. ఆంగ్లేయుల నాటి ఆర్డర్లీ వ్యవస్థ కొనసాగించరాదని, ఆర్డర్లీలుగా పనిచేస్తున్న కానిస్టేబుళ్లందరినీ పోలీసు డ్యూటీకే పరిమితం చేయాలని డీజీపీని గతంలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు ఆర్డర్లీ వ్యవస్థ రద్దుకు చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డర్లీల రద్దుకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఈ కేసు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు ఆర్డర్లీ రద్దుకు డీజీపీ చేపట్టిన చర్యలను న్యాయమూర్తి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో మంగళవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నాలుగు నెలల్లోగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్డర్లీ వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని తేల్చి చెప్పారు. ఇకపై ఎక్కడైనా ఆర్డర్లీ ఉన్నట్లు తెలిస్తే పోలీసు ఉన్నతాధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కూడా దేశించారు. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారుల ఇంటి పనుల కోసం సహాయకులను నియమించుకునే  వీలును కూడా కల్పించవచ్చని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-24T14:19:48+05:30 IST