దేశమా.. మతమా.. ఏది గొప్ప?
ABN , First Publish Date - 2022-02-11T08:13:15+05:30 IST
దేశం, మతం.. ఈ రెంటిలో ఏది సర్వోన్నతమైనదని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ‘కొందరు హిజాబ్ కావాలంటున్నారు.. ఇంకొందరు టోపీ ఉండాలంటున్నారు.. మరికొందరు మరేవో అడుగుతున్నారు. ఇది సమైక్య దేశమా?
- మనది లౌకిక దేశం..
- డ్రెస్ కోడ్‌పై కొన్ని శక్తులు వివాదాలు లేవనెత్తుతున్నాయి
- అవి దేశమంతా వ్యాపిస్తున్నాయ్ మతం పేరిట చీల్చే యత్నం: మద్రాసు హైకోర్టు
చెన్నై, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): దేశం, మతం.. ఈ రెంటిలో ఏది సర్వోన్నతమైనదని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ‘కొందరు హిజాబ్ కావాలంటున్నారు.. ఇంకొందరు టోపీ ఉండాలంటున్నారు.. మరికొందరు మరేవో అడుగుతున్నారు. ఇది సమైక్య దేశమా? లేక మతం, ఇతర ప్రాతిపదికలతో చీలిపోయిందా? ఇది నిజంగా దిగ్ర్భాంతి కలిగిస్తోంది’ అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ భండారీ వ్యాఖ్యానించారు. కర్ణాటక కాలేజీలో తలెత్తిన ‘హిజాబ్’ వివాదం దేశమంతటా విస్తరించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాఽధాన్యం ఏర్పడింది. తమిళనాట దేవాలయాల్లో డ్రెస్‌కోడ్ విధిగా పాటించేలా ఉత్తర్వులివ్వాలని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలు గురువారం జస్టిస్ భండారీ, జస్టిస్ డి.భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా జస్టిస్ భండారీ స్పందిస్తూ.. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేశారు.
ప్రస్తుత పరిణామాలను చూస్తే దేశాన్ని మతప్రాతిపదికన చీల్చే యత్నం జరుగుతోందని స్పష్టమవుతోందన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 1947నాటి తమిళనాడు ఆలయ ప్రవేశ చట్టంలో హిందూయేతరులు ఆలయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదన్నారు. 1970లో హిందూయేతరులు కూడా ఆలయాల్లోకి ప్రవేశించేలా తీసుకొచ్చిన చట్టాన్ని 1972లో హైకోర్టు రద్దు చేసిందని, కానీ అందుకు భిన్నంగా అన్యమతస్తులు, విదేశీయులను ఆలయాల్లోకి అనుమతిస్తున్నారని తెలిపారు.
భక్తులు ఆలయాల నిబంధనల ప్రకారం దుస్తులు ధరించాలని, తంజావూరు, మదురై తదితర ఆలయాల్లోకి వివిధ మతాలకు చెందిన వారు లుంగీ, ప్యాంట్లతో వస్తున్నారని.. అందువల్ల హిందూయేతరులకు అనుమతి లేదంటూ ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద ప్రకటన బోర్డులు ఏర్పాటుచేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. నిర్దిష్ట డ్రెస్‌కోడే లేనప్పుడు ఇలాంటి బోర్డులు ఎలా పెడతారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ఆదేశాలివ్వాలని పిటిషనర్ పదేపదే కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. ధర్మాసనంతో తగవు పడవద్దని.. సముచిత భాష ఉపయోగించాలని హితవు పలికింది. ఆగమశాస్త్రంలో ధోవతులు మాత్రమే ధరించాలని చెప్పినట్లు ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. పిటిషనర్ బదులిస్తూ.. ఆధారాల సేకరణకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. తమిళనాడు అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగసుందరం స్పందిస్తూ.. డ్రెస్ కోడ్‌ను నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ గతంలో కొట్టివేసిందని.. అయితే ఇది విస్తృత ఆందోళనలకు దారితీసిందని తెలిపారు.