మురిసిన మదురై

ABN , First Publish Date - 2022-04-16T13:22:24+05:30 IST

మదురై మీనాక్షి సుందరేశ్వరర్‌ ఆలయ చిత్తిరై ఉత్సవాల్లో చివరిఘట్టమైన రథోత్సవం శుక్రవారం ఉదయం అత్యంత వైభంగా జరిగింది. రెండేళ్ల తరవాత ఈ వేడుకల్లో భక్తులకు అనుమతి వ్వడంతో మదురై

మురిసిన మదురై

- వైభవంగా మీనాక్షి సుందరేశ్వరుల రథోత్సవం

- పోటెత్తిన భక్తజనం


చెన్నై: మదురై మీనాక్షి సుందరేశ్వరర్‌ ఆలయ చిత్తిరై ఉత్సవాల్లో చివరిఘట్టమైన రథోత్సవం శుక్రవారం ఉదయం అత్యంత వైభంగా జరిగింది. రెండేళ్ల తరవాత ఈ వేడుకల్లో భక్తులకు అనుమతి వ్వడంతో మదురై మాసి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ఈ భక్తజనం నడుమ అయ్యవారి మహారథం, అమ్మవారి రథం ఒకదాని తర్వాత ఒకటిగా  ఊరేగాయి. గురువారం ఉదయం మీనాక్షి సుందరేశ్వరర్ల తిరుకళ్యాణం జరగగా, శుక్రవారం ఉదయం రథోత్సవం ప్రారంభమైంది. ముందుగా వేకువజామున మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరులు రామనాధపురం సేతుపతి మహారాజ మండపానికి చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. అక్కడ ఆలయ ప్రధానార్చకులు, భట్టాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఒకే పల్లకీలో మీనాక్షి సుందరేశ్వర్లు తూర్పుమాసి వీధిలోని రథాల మండపానికి చేరుకున్నారు. ఉదయం 7.32 గంటలకు అలంకరించిన పెద్ద రథంలో సుందరేశ్వర్‌ బయలుదేరారు.  8.15 గంటలకు మీనాక్షి అమ్మవారు చిన్నరథంలో స్వామివారిని వెంబడించారు. ఈ రెండు రథాలకు ముందు  ఆలయ ఏనుగును నడిపించారు. దాని వెనుకనే వినాయకుడు, మురుగన్‌, నాయన్మార్లు వేర్వేరు సప్పరాల్లో ఊరేగారు. ఈ రథోత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు రావడంతో  మాసి వీధుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలకు నాలుగు మాసివీథులలో ప్రదక్షిణ అనంతరం రథాలు రథ మండపానికి చేరుకున్నాయి. ఆ తర్వాత చండికేశ్వరుల ఊరేగింపు జరిగింది. సాయంత్రం మీనాక్షి సుందరేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి సప్తావర్ణ సప్పరంలో సుందరేశ్వరర్‌ మాసివీథులలో ఊరేగారు. శనివారం స్వర్ణతామర కొలనులో తీర్థవారితో ఈ వేడుకలు పూర్తికానున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకు తిరుకళ్యాణోత్సవానికి విచ్చేసిన తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామివారు, పవళకనివాయ్‌ పెరుమాళ్‌ 16 కాళ్ళ మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన మీదట వారి స్వక్షేత్రాలకు చేరుకోనున్నారు.

Updated Date - 2022-04-16T13:22:24+05:30 IST