నేటినుంచి మదురైలో చిత్తిరై ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-04-05T14:00:22+05:30 IST

రెండేళ్ల అనంతరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను

నేటినుంచి మదురైలో చిత్తిరై ఉత్సవాలు

                   - 14న తిరుకల్యాణం, 15న రథోత్సవం


పెరంబూర్‌(చెన్నై): రెండేళ్ల అనంతరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని రథానికి మరమ్మతులు, మాఢవీధులు, ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి మీనాక్షి, సుందరేశ్వరస్వామి, పంచమూర్తులు ఉదయం, రాత్రి వేళల్లో వేర్వేరు వాహనాల్లో మాడ వీధుల్లో విహరించనున్నారు. ఉత్సవాల్లో ప్రధానాంశాలైన మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం 12న, అలాగే, 14వ తేదీ తమిళ సంవత్సరాది రోజున మీనాక్షి-సుందరేశ్వరర్‌ తిరుకల్యాణం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం పశ్చిమ, దక్షిణ వీధుల కూడలిలోని కల్యాణమండపంలో అమ్మవారి కల్యాణోత్సవం జరుగనుంది. ఇందుకోసం  భారీ పందిళ్లు ఏర్పాటుచేశారు. తిరుకల్యాణం రోజున భక్తుల సౌకర్యార్ధం రూ.200, రూ.500 దర్శన టిక్కెట్లతో పాటు, దక్షిణ గోపురం గుండా ఉచిత దర్శనానికి 12 వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. దర్శన టిక్కెట్లను భక్తులు www.maduraimeenakshi.Org అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 7వ తేది వరకు పొందవచ్చు. తిరుకల్యాణం అనంతరం మీనాక్షి అమ్మవారు పుష్ప పల్లకీలో విహరించనున్నారు. అనంతరం 15వ తేది రథోత్సవం, 16న తీర్థవారి జరుగుతుందని ఆలయ ట్రస్టీ కరుముత్తు కన్నన్‌, జాయింట్‌ కమిషనర్‌ చెల్లదురైలు  తెలిపారు.

Updated Date - 2022-04-05T14:00:22+05:30 IST