Abn logo
Sep 18 2020 @ 12:58PM

ఈ బ్లడ్‌బ్యాంక్ మనుషులకు కాదు!

Kaakateeya

లూధియానా: ఆ కుక్కపిల్ల పేరు పప్పీ. ఇంట్లో అందరూ దాన్ని అల్లారుముద్దుగా పెంచుతారు. ఆఫీసుకు వెళ్లిన నాన్న, మార్కెట్‌కు వెళ్లిన అమ్మ, స్కూలుకు వెళ్లిన అన్నయ్య.. ఇలా ఎవరు ఇంటికి తిరిగొచ్చినా ముందుగా వాళ్లని పప్పీనే పలకరిస్తుంది. వారి చుట్టూ గిరికీలు కొడుతూ సంతోషం ప్రకటిస్తుంది. ఇలా ఇల్లంతా గునగునా తిరిగే పప్పీ అంటే ఆ కుటుంబానికి ఎక్కడలేనంత ప్రేమ. అలాంటిది ఓ రోజు వాకింగ్‌కు వెళ్లినప్పుడు పప్పీకి యాక్సిడెంట్ అయింది. చాలా రక్తం పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తే రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఇలాంటి ఘటనలు జరగకూడదని ఓ యూనివర్సిటీ భావించింది. అందుకే జాగిలాల కోసం ప్రత్యేకంగా ఓ బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేసింది.

పంజాబ్‌లోని లూధియానాలో గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ ఉంది. దీన్ని షార్ట్‌కట్‌లో గద్వాసు అని పిలుస్తారు. దీనిలో వైద్యులకు వచ్చిన ఆలోచనే ఈ 'డాగ్‌ బ్లడ్‌బ్యాంక్'. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బ్లడ్‌బ్యాంక్ ఉత్తర భారతంలో మొట్టమొదటి 'డాగ్‌ బ్లడ్ బ్యాంక్'. దేశఃలో రెండోది. లూధియానాలో ఇది ఏర్పాటు చేయడం వల్ల ఢిల్లీ, హరియాణా తదితర రాష్ట్రాల నుంచి కూడా చాలా కేసులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.

మనుషుల్లానే శునకాల్లో కూడా రక్తమార్పిడి చాలా ఉపయోగకరమని డాక్టర్లు చెప్తున్నారు. రక్తమార్పిడి వల్ల విషమ పరిస్థితుల్లో ఉన్న శునకం ప్రాణాలు కూడా నిలబెట్టే అవకాశం లభిస్తుందని అన్నారు. దీని వల్ల చికిత్స అందిస్తున్న వైద్యుడికి ఊపిరి తీసుకునే సమయం లభిస్తుందని, దీంతో ఆ తర్వాతి చికిత్సను మరింత పకడ్బందీగా ప్లాన్ చేయగలుగుతారని వివరించారు.

మానవ జీవితంలో శునకాల పాత్ర చాలా ముఖ్యమైనది. పెంపుడు కుక్కలతో ఆడుకుంటే హృదయానికి మంచిదని చాలా పరిశోధనలు వెల్లడించాయి. డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను పట్టించడంలో జాగిలాల పాత్ర అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని గజగజలాడించిన ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ను మట్టుబెట్టడంలో కూడా ఓ శునకమే ప్రధాన పాత్ర వహించిన విషయం తెలిసిందే. మానవ మనుగడకు ఇంత సేవ అందిస్తున్న శునకాల ప్రాణాలు కాపాడటం కోసం ఈ మాత్రమైనా చేయాల్సిందేనని గద్వాసు వైద్యులు అభిప్రాయపడ్డారు.

గద్వాసుకు ఏటా కనీసం 25వేల శునకాలను చికిత్స కోసం తీసుకొస్తారని, వీటిలో కనీస 500-600 జాగిలాల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందని ఇక్కడి వైద్యులు తెలియజేశారు. ఈ శునకాలకు రక్తమార్పిడి చేయడం ద్వారా వీటి ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు తాము 125 సార్లు శునకాలకు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ ఇలాంటి సందర్భాల్లో వేరే శునకం నుంచి రక్తాన్ని దెబ్బతిన్న జాగిలానికి నేరుగా ఎక్కించేవాళ్లమని చెప్పారు. కాగా, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో.. శునకాల రక్తాన్ని ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ ఇలా మూడు భాగాలుగా భద్రపరుస్తామని తెలిపారు. దీని వల్ల రక్తం వృధా కాదని, ఎక్కువ ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.

ఇప్పటి వరకూ దేశంలో 25 రాష్ట్రాలు 'డాగ్‌ బ్లడ్‌బ్యాంక్' అనుమతుల కోసం కేంద్రానికి అభ్యర్థనలు పంపాయి. వీటిలో కేవలం రెండే రాష్ట్రాలకు అనుమతి లభించినట్లు గద్వాసు డాక్టర్ సుకృతి శర్మ తెలియజేశారు. వాటిలో ఒకటి చెన్నైలో ఉండగా, రెండోది ఇప్పుడు పంజాబ్‌లో ఏర్పాటయిందని తెలిపారు. ఇది ఉత్తర భారతంలో తొలి డాగ్‌ బ్లడ్‌బ్యాంక్‌ అని స్పష్టంచేశారు. ఈ బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటుపై స్థానిక డాగ్ లవర్స్ సంతోషం వ్యక్తంచేశారు.

Advertisement
Advertisement
Advertisement