తక్కువ ఖర్చు.. ఫాస్ట్‌ చార్జింగ్‌

ABN , First Publish Date - 2022-08-05T12:05:26+05:30 IST

విద్యుత్‌ వాహనాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీలు చార్జింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి.

తక్కువ ఖర్చు.. ఫాస్ట్‌ చార్జింగ్‌

అధిక శక్తినిచ్చే సోడియం బ్యాటరీలు

ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకుల ఆవిష్కరణ

విద్యుత్‌ వాహనాల ధరలు తగ్గే అవకాశం

కోల్‌కతా, ఆగస్టు 4: విద్యుత్‌ వాహనాల్లో ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీలు చార్జింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపే దిశగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు ముందడుగు వేశారు. నానో మెటీరియల్‌ను వినియోగించి.. సోడియం అయాన్‌ ఆధారిత బ్యాటరీలు, సూపర్‌ కెపాసిటర్లను అభివృద్ధి చేశారు. సోడియం అయాన్‌ (ఎన్‌ఏ-అయాన్‌) ఆధారిత బ్యాటరీలు ఫాస్ట్‌గా చార్జింగ్‌ అవడమే కాదు.. తక్కువ ఖర్చుతోనే వీటిని తయారు చేయవచ్చు.  సోడియం ఐరన్‌ పాస్పేట్లు, సోడియం మాంగనీస్‌ పాస్పేట్లను వినియోగించి తమ బృందం కొత్త తరం బ్యాటరీలను అభివృద్ధి చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది.


ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్‌ అమరీష్‌ చంద్ర నేతృత్వంలోని పరిశోధకుల బృందం సోడియం అయాన్‌ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం తీవ్రంగా శ్రమించిందని వెల్లడించింది. ‘సోడియం ఆధారిత ఆక్సైడ్లలోని నానోస్ట్రక్చర్లు, కార్బన్ల కలయిక తక్కువ సమయంలోనే అధిక శక్తిని అందించగలదు. ఈ బ్యాటరీలను ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాల్లో వినియోగించవచ్చు. ఇవి ఎక్కువ శక్తిని, అధిక పనితీరును కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే విద్యుత్‌ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి’ అని ప్రొఫెర్‌ అమరీష్‌ చంద్ర తెలిపారు.

Updated Date - 2022-08-05T12:05:26+05:30 IST