కమలం దూకుడు

ABN , First Publish Date - 2022-08-20T05:07:04+05:30 IST

రాష్ట్రంలో రోజురోజుకూ బలపడుతూ వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సను

కమలం దూకుడు

  • చేరికలపైనే ప్రత్యేక దృష్టి
  • ఆయా పార్టీ సీనియర్లతో మంతనాలు
  • 21న అమిత్‌షా సమక్షంలో కొందరు చేరే అవకాశం?


రాష్ట్రంలో రోజురోజుకూ బలపడుతూ వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సను ఢీకొనే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆయా పార్టీల్లో అసంతృప్తులను, తటస్థులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టానికి సీనియర్‌ నేతలకు పార్టీ కండువాలు వేసేలా ప్రణాళిక రచించింది. ఎల్లుండి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనలో చేరికలు ఉండేలా బీజేపీ నాయకులు మంతసాలు సాగిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా వివిధ పార్టీల్లో అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండడంతో బీజేపీ ఇక్కడ అందివచ్చే ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇప్పటికే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కాషాయికండువా కప్పిన విష యం తెలిసిందే. చేరికలను మరింత ఉధృతం చేసేయత్నం చేస్తోంది. ఎల్లుండి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రానుండడంతో ఆ రోజు పెద్దఎత్తున పార్టీలోకి చేరికలు ఉండే విధంగా బీజేపీ నాయకత్వం ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇతర పార్టీ నేతలను ఆ రోజు బీజేపీలోకి రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలో అసంతృప్తిగా ఉన్న బడా నేతలతో బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలతో పాటు తటస్థంగా ఉన్న మరికొందరితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొన్నాళ్లపాటు ఎడమోహంపెడమోహంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాసాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని కలిసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ బోయిగూడ ముదిరాజ్‌ భవన్‌లో కలిసి ఉన్నారు. అక్కడ రాజకీయ చర్చలేమీ జరగలేదని వారు చెబుతునప్పటికీ పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు వారితో పాటు ఉన్న వారు చెప్పారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ముగ్గురు ముఖ్య నేతలను బీజేపీ టార్గెట్‌ చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న సదరు నేతలు కాంగ్రెస్‌ వైపు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇది గమనించిన బీజేపీ వారిని కూడా తమవైపు తిప్పుకునే పనిలో పడింది. అలాగే కాంగ్రె్‌సకు రాజీనామా చేసి రాజకీయాల్లో తటస్థంగా ఉన్న ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ముఖ్య నేతతోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. తాను రాజకీయాలు వదిలేసిన తరువాత ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నానని, కొన్నాళ్లపాటు ఇలానే తనను వదిలేయాలని సదరు నాయకుడు కోరినట్లు తెలిసింది. మరో వైపు ఆయన్ని తిరిగి రప్పించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రె్‌సను మీరు వదులుకున్నా మీరు కాంగ్రె్‌సకు కావాలని ఏఐసీసీ నేత ఒకరు ఆయనపై వొత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన మరికొంత సమయం అడిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇక ఒక మాజీ ఎమ్మెల్సీకి బీజేపీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇంకా ఆయన ఊగిసలాడుతునే ఉన్నారని ఇంకా ఏ విషయం తేల్చడం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. కాంగ్రె్‌సకు చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడితో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. వివాదరహితుడైన ఆయన కొన్నేళ్లుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో నేతల కొరత ఉండడంతో బీజేపీ ఆయనను కూడా శివార్లలోని ఓ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కూడా చేరికల కమిటీలో స్థానం కల్పించారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఈ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బలమైన నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ మేరకు ఆయన  చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో తన ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన సొంతంగా ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు.




Updated Date - 2022-08-20T05:07:04+05:30 IST