సడలిన పోలీస్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-05-17T06:29:58+05:30 IST

ఉత్సవాల్లో పోలీసుల ఆంక్షల కారణంగా స్థానికులు, భక్తులు పడుతున్న ఇబ్బందులను పోలీసు అధికారులు సోమవారం తొలగించారు.

సడలిన పోలీస్‌ ఆంక్షలు
నక్కలపుట్టు వద్ద సిబ్బందికి సూచనలిస్తున్న అదనపు ఎస్‌పీ జగదీశ్‌, చిత్రంలో చింతపల్లి ఏఎస్‌పీ తుషార్‌డూడి


వాహనాల రాకపోకలకు అనుమతి

పట్టణంలో పర్యటించిన పోలీస్‌ ఉన్నతాధికారులు

ఆలయం వద్ద మహిళా, సచివాలయ పోలీసులు 

రాత్రి వేళల్లో పరిమితమైన ఆంక్షలు

పాడేరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉత్సవాల్లో పోలీసుల ఆంక్షల కారణంగా స్థానికులు, భక్తులు పడుతున్న ఇబ్బందులను పోలీసు అధికారులు సోమవారం తొలగించారు. ఉత్సవాల్లో పోలీసుల ఆంక్షలు, జనం ఇబ్బందులపై ‘ఉత్సవాల్లో పోలీసుల ఓవర్‌యాక్షన్‌’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనానికి పోలీసు అధికారులు స్పందించారు. వాస్తవంగా ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులు, స్థానికంగా ఉన్న ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రత్యేకంగా గుర్తించారు. దీంతో పట్టణంలో జనం రద్దీలేని సమయాల్లో ద్విచక్ర వాహనాలను అనుమతించడం, రాత్రి వేళల్లో మాత్రమే రాకపోకలపై పరిమితమైన ఆంక్షలు పెట్టాలని నిర్ణయించారు. అలాగే సోమవారం జనం రాకపోకలకు ఎటువంటి ఆంక్షలను పెట్టలేదు. తొలిరోజు తలెత్తిన పొరపాట్లను సరిదిద్దారు. మిగిలిన రెండు రోజులు జనం స్వేచ్ఛగా ఉత్సవాల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అందులో భాగంగా స్థానిక అదనపు ఎస్‌పీ జగదీశ్‌, చింతపల్లి ఏఎస్‌పీ తుషార్‌డూడి పట్టణంలోని బందోబస్తు ఏర్పాట్లు, మోదకొండమ్మ ఆలయం, శతకంపుట్టు ప్రాంతాలతోపాటు వాహనాల తనిఖీలకు ఏర్పాటు చేసిన పాయింట్‌లను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అలాగే మోదకొండమ్మ ఆలయం, శతకంపుట్టు వద్ద సైతం ప్రత్యేకంగా మహిళా పోలీసులు, సచివాలయ (మహిళ) పోలీసులను ఏర్పాటు చేశారు. పోలీసుల దిద్దుబాటు చర్యలతో పట్టణ వాసులు, భక్తులు హర్షం వ్యక్తంచేశారు. 


Updated Date - 2022-05-17T06:29:58+05:30 IST