చర్చలు లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా, వర్ధిల్లు : చిదంబరం

ABN , First Publish Date - 2021-11-30T20:06:10+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై

చర్చలు లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా, వర్ధిల్లు : చిదంబరం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంటులో చర్చించకుండానే మూడు సాగు చట్టాలను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, ‘చర్చలు లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా, వర్ధిల్లు’ అని ఆవేదనతో వ్యాఖ్యానించారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఓ సంవత్సరం నుంచి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరి డిమాండ్లకు తలొగ్గిన ప్రభుత్వం వీటిని ఉపసంహరించాలని నిర్ణయించింది. మోదీ నవంబరు 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లుగానే ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే (సోమవారం) వీటిని రద్దు చేసింది. వీటిని రద్దు చేస్తూ ప్రతిపాదించిన బిల్లుపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. 


ఈ నేపథ్యంలో చిదంబరం మంగళవారం ట్విటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మోదీ మాట్లాడుతూ ఏ అంశంపైన అయినా చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే మొదటి రోజు జరిగిన తొలి కార్యకలాపం అయిన సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగలేదన్నారు. చర్చ లేకుండానే వీటిని ఆమోదించారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పిన మాటలు గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించినపుడు చర్చ అవసరం లేదని తోమర్ చెప్పడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఇరు పక్షాల మధ్య అంగీకారం లేనపుడు సాగు చట్టాలను చర్చ లేకుండానే ఆమోదించారని, ఇరు పక్షాలు అంగీకరించినపుడు వీటిని చర్చ లేకుండానే రద్దు చేశారని అన్నారు. ఏమైనప్పటికీ, చర్చ అనేది జరగలేదన్నారు. ‘‘చర్చలు లేని పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా, వర్ధిల్లు’’ అని చిదంబరం పేర్కొన్నారు. 


జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సోమవారం ఇదే విధంగా స్పందించారు. సాగు చట్టాలను చర్చ లేకుండానే ఆమోదించారని, చర్చ లేకుండానే రద్దు చేశారని, నవ భారతానికి నూతన నమూనా ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-30T20:06:10+05:30 IST