పీవీజీ రాజు విగ్రహం వద్ద బీశెట్టి మౌనదీక్ష

ABN , First Publish Date - 2020-10-29T06:15:29+05:30 IST

కోట బురుజుపై నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్న ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతి, కుమార్తె ఊర్మిళ గజపతిరాజులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సంచయిత ఆదేశించడం సరికాదని పీవీజీ రాజు కళావేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్‌ చైర్‌పర్సన్‌గా సంచయితకు ఎంతటి హక్కులు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ హక్కులు ఊర్మిళకు కూడా ఉంటాయనే నిజాన్ని సంచయిత తెలుసుకోవాలన్నారు.

పీవీజీ రాజు విగ్రహం వద్ద బీశెట్టి మౌనదీక్ష
మౌనదీక్షలో బీశెట్టిబాబ్జీ

 సుధా, ఊర్మిళ గజపతిరాజుల మద్దతు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 28: కోట బురుజుపై నుంచి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్న ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతి, కుమార్తె ఊర్మిళ గజపతిరాజులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని మాన్సాస్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ సంచయిత ఆదేశించడం సరికాదని పీవీజీ రాజు కళావేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్‌ చైర్‌పర్సన్‌గా సంచయితకు ఎంతటి హక్కులు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ హక్కులు ఊర్మిళకు కూడా ఉంటాయనే నిజాన్ని సంచయిత తెలుసుకోవాలన్నారు. అమ్మవారి పండగలో మంగళవారం జరిగిన ఆ ఘటనను నిరశిస్తూ బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని మోసానిక్‌ టెంపుల్‌ ప్రాంగణంలో ఉన్న పీవీజీ రాజు విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఆయనకు ఆనందగజపతిరాజు సతీమణి సుధా గజపతి, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు మద్దతు తెలిపారు. సంచయిత తీరుతో పీవీజీ ప్రతిష్ట దెబ్బతిందని బీశెట్టి మండిపడ్డారు. రాజకీయాల్లోనే కాకుండా ఓ గొప్ప ఆర్థికవేత్తగా దివంగత ఆనందగజపతిరాజు కీర్తి సంపాదించారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి కుటుంబాన్ని అవమానించటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే మాన్సాస్‌ ట్రస్టు భ్రస్టు పట్టుకుపోయిందని ప్రజలు భావిస్తున్న సమయంలో రాజుల కుటుంబం చుట్టూ రాజకీయాలు చోటుచేసుకోవటం మంచిది కాదన్నారు. సంచయిత తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. 


మనోవేదనకు గురయ్యాం

 సిరిమానోత్సవం చూడటానికి కోట బురుజుపై కూర్చున్న తమకు ఎదురైన ఘటనతో మనో వేదనకు గురయ్యామని సుధా, ఊర్మిళ గజపతిరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. బీశెట్టి బాబ్జీ చేపట్టిన మౌనదీక్షకు మద్దతు పలికారు. దీక్షకు టీడీపీ నాయకులు కనకల మురళీమెహనరావు, శాపమిత్ర వేదిక ప్రతినిధులు పి.చంద్రరావు, కిల్లాన మహేష్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు మద్దతు పలికారు. 

 

Updated Date - 2020-10-29T06:15:29+05:30 IST