తుగ్లక్‌పాలనకు పతనం ఆరంభం: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-02-20T07:57:05+05:30 IST

‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం సర్వనాశనమైంది. ప్రతిపక్ష పార్టీపై కక్షసాధింపు ఫుల్‌... అభివృద్ధి, సంక్షేమం నిల్‌. ఈ తొమ్మిది మాసాల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప

తుగ్లక్‌పాలనకు పతనం ఆరంభం: లోకేశ్‌

మంగళగిరి టౌన్‌, ఫిబ్రవరి 19: ‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం సర్వనాశనమైంది. ప్రతిపక్ష పార్టీపై కక్షసాధింపు ఫుల్‌... అభివృద్ధి, సంక్షేమం నిల్‌. ఈ తొమ్మిది మాసాల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప... తుగ్లక్‌ సీఎం చేసిన ఒక్క మంచి పనీ లేదు. దుర్మార్గ విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం పతనం ఆరంభమైంద’ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరి పట్టణంలో బుధవారం నుంచి ప్రజాచైతన్య యాత్రలు ఆరంభమయ్యాయి. స్థానిక 27వ వార్డు నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో లోకేశ్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నిర్మించిన పంచాయతీ భవనాలకు వైసీపీ రంగుల పథకం కింద సుమారు రూ.1300కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి వైసీపీ రంగులు పులిమారన్నారు. పంచాయతీ భవనాలు, పాఠశాలలు, శ్మశానవాటికలు, ఆఖరికి మరుగుదొడ్లను కూడా వదలకుండా పార్టీ రంగులు వేశారన్నారు. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడం, ముఖ్య నాయకులకు భద్రత తగ్గించడం, ప్రతిపక్ష నాయకులపై దాడులకు తెగబడడం తప్ప తొమ్మిది నెలల్లో ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్‌ ఇస్తామని, డ్వాక్రారుణాలు మాఫీచేస్తామని చెప్పిన ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేసిందన్నారు. రూ.మూడు వేల పింఛన్‌ ఇస్తామని చెప్పి కేవలం రూ.250 మాత్రమే పెంచి, ఏడు లక్షల పెన్షన్లు తొలగించి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నమ్మక ద్రోహం చేసిందన్నారు. అన్న క్యాంటీన్లను మూసివేసి, 20లక్షల రేషన్‌ కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టిందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం వుందన్నారు. 15 లక్షల మంది రైతులకు రూ.12,500 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి, కేవలం 50వేల మందికి రూ.7,500 చొప్పునమాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొందని విమర్శించారు. నిరుద్యోగభృతిని రద్దుచేయడమే కాకుండా కియా, లాలూ, అదానీ వంటి ప్రముఖ సంస్థలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.  మూడు ముక్కల రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చీలికలు తెచ్చి, ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెంచిన చార్జీలు తగ్గించి, తొలగించిన పింఛన్లను పునరుద్ధరించే వరకు ఈ తుగ్లక్‌ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందని లోకేశ్‌ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పూర్వ ఇన్‌చార్జిలు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు, నేతలు నందం అబద్దయ్య, మాచర్ల నిర్మల, ఆకుల జయసత్య, గుత్తికొండ ధనుంజయరావు, కొమ్మారెడ్డి కిరణ్‌, కంచర్ల ప్రకాశరావు, మహమ్మద్‌ ఇబ్రహీం, షేక్‌ రియాజ్‌, దొప్పలపూడి జ్యోతిబసు, దామర్ల రాజు, కట్టెపోగు రత్నమా ణిక్యం, వైష్ణవి, కోనంకి శ్రీనివాసరావు, అబ్దుల్‌ కరీమ్‌, పోలుమట్ల ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T07:57:05+05:30 IST