విజయవాడ: నరసరావుపేట పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని లోకేష్ వేసిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక మౌనం వహించారు. అనవసరంగా తన పర్యటనను రాద్దాంతం చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. తాను పాదయాత్రలు, ఆందోళనలు, ధర్నాలు చేయడానికి వెళ్లడంలేదని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే వెళుతున్నానని, తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం సరికాదన్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని.. అలాంటప్పుడు తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. దీనికి వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. మీడియా సమావేశాల్లో ముఖ్యమంత్రిని కొట్టమని చెప్పలేదని, కేవలం బాధితులను పరమర్శించడానికి మాత్రమే వెళుతున్నానని, న్యాయబద్ధంగానే పోరాటం చేస్తామని చెప్పారు. ఏపీలో ఎక్కడాలేని లా అండ్ ఆర్డర్స్ ఒక్క గుంటూరు జిల్లాలోనే ఎందుకు ఉన్నాయని లోకేష్ ప్రశ్నించారు.