ఉల్లం ’ఘనులు’.. ‘లాక్‌డౌన్‌’ వేళ కొందరి ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2021-06-17T05:24:10+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికొస్తోంది. ఆ వైరస్‌ సోకిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో తెలియక అంతా భయం భయంగా గడపాల్సి వస్తోంది. చివరకు సొంత మనుషులపై కూడా నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. ఇంతటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకుగాను ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా వారు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనాను కొందరు అసలు లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు.

ఉల్లం ’ఘనులు’..  ‘లాక్‌డౌన్‌’ వేళ కొందరి ఇష్టారాజ్యం
నగరంలో లాక్‌డౌన్‌ ను పరిశీలిస్తున్న సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ (ఫైల్‌)

 రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

 గతంకంటే భారీగా పెరిగిన వాహనాలసీజ్‌

 కమిషనరేట్‌ పరిధిలో 20వేలకు చేరిన కేసుల సంఖ్య

 వాకింగ్‌కు రోడ్డెక్కిన వారిసంఖ్య నిల్‌

ఖమ్మం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికొస్తోంది. ఆ వైరస్‌ సోకిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో తెలియక అంతా భయం భయంగా గడపాల్సి వస్తోంది. చివరకు సొంత మనుషులపై కూడా నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. ఇంతటి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకుగాను ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా వారు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనాను కొందరు అసలు లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా  ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులు నమోదు చేసిన ఉల్లంఘన కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పోలీసులు రాత్రి, పగలు తేడా లేకుండా రోడ్లపై తిరుగుతూ కట్టడి చేస్తున్నా అవేమి లెక్కచేయకుండా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో ఇతర క్రైం తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ ఉల్లం‘ఘనుల’పై మాత్రం కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 

లాక్‌డౌన్‌ లెక్కచేయని క్రైం 

పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొందరు, కరోనా మహమ్మారికి బయపడి మరికొందరు చాలావరకు ఇళ్లనుంచి బయటకు రావడం మానేశారు. 20శాతం మంది మాత్రం ఇష్టారీతిన రోడ్లపైకి వస్తూ లాక్‌డైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కాగా కరోనా నుంచి బయటపడేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో గతంకంటే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పోలీసులు గతంలో ఎపడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు, వాకర్స్‌, వాహనాలు సీజ్‌, చలానాలు విధించడం, పెట్టీ కేసులు నమోదు చేసేవారు. కాగా ఈ సంవత్సరం మొత్తం పిట్టీ కేసులు 18,283 కాగా అందులో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 10,491 ఉన్నాయి. ఈ ఏడాది వాటి సంఖ్య మూడింతలు పెరిగింది. 3అంటే ఏ స్థాయిలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారో అర్థం చేసుకోవచ్చు. అయితే గత ఏడాది పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఏర్పాటు చేసిన కారణంగా ప్రజలు అంతటిస్థాయిలో ఇళ్లనుంచి బయటకు రావడం కాస్త తక్కువేననీ, ఈ ఏడాది విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన కారణంగా ప్రజలు బయటకు వచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వచ్చినవారిపై పోలీసులు కఠినంగా వ్యవహిరించి వారిపై కేసులు నమోదు చేయడంతోనే కేసులు సంఖ్య పెరిగినట్టు తెలుస్తుండగా ఇప్పటివరకు చలాన్ల రూపంలో విధించిన నగదు రూ.2కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా వేస్తున్నారు.

వాకింగ్‌కు రోడ్డెక్కిన వారిసంఖ్య నిల్‌ 

గత లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపైకి రావొద్దని చెబుతున్నప్పటికీ కొందరు నేరుగా వాకింగ్‌కు వెళ్లారు. అలా వాకింగ్‌కు వెళ్లిన ఘటనల్లో 830 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ సంవత్సరం లాక్‌డౌన్‌ వేళ అలాంటి పరిస్థితులు లేకపోవడం గమనార్హం. ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా వాకింగ్‌ కోసం ప్రత్యేకంగా ఎవరూ రోడ్లపైకి రాలేదని పలువురు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత లాక్‌డౌన్‌ సమయం నుంచే లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయంటున్నారు. గత ఏడాది మొదటి లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదటి 20 రోజుల వరకు ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రాకపోవడంతో తక్కువ కేసులే నమోదయ్యాయనీ, ఆ తర్వాత నుంచి ఆ సంఖ్య పెరుగుతూ వచ్చిందన్నారు. అలా పెరిగిన కారణంగానే ఈ ఏడాది భారీస్థాయిలో కేసులు నమోదయ్యాయన్న చర్చ జరుగుతోంది. కాగా గత లాక్‌డౌన్‌లో మొదటి 20రోజుల్లో కేవలం 214 కేసులే నమోదయ్యాయి. అందులో 97వాహనాల సీజింగ్‌ కేసులు నమోదు చేసి 394 వాహనాలను సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 44షాపులపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ కింద 43 కేసులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద 30 కేసులు ఉన్నాయి. కాగా ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య బాగా పెరిగింది. సగటున రోజుకు 15నుంచి 20కేసుల వరకు నమోదవగా అనంతరం మరో 20 రోజుల్లోనే 600పైగా కేసులు నమోదవడం గమనార్హం. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించడంతోపాటు, లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2021-06-17T05:24:10+05:30 IST