నెట్‌ ఇంటిలో...

ABN , First Publish Date - 2020-04-03T11:15:16+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

నెట్‌ ఇంటిలో...

ఆన్‌లైన్‌లోనే పౌరసేవలు, నిత్యావసరాలు

విద్యార్థుల్లో అనుమానాల నివృత్తి

హోమ్‌ టూ వర్క్‌కూ ఉపయోగం 

లాక్‌డౌన్‌ వేళ పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగం


విజయనగరం (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులకు తప్పించి బయటకు రాలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు నెట్‌ వినియోగమూ ఆ స్థాయిలోనే పెరిగింది. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా ఇంటికి అవసరమైన సరుకులు తెప్పించుకుంటున్నారు. విద్యుత్‌ బిల్లులు, ఆదాయపు పన్ను, టీవీ, ఇతరత్రా బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించుకుంటున్నారు. మందులు, ఇతర నిత్యావసరాల వంటివి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని ఇంటికి రప్పించుకుంటున్నారు. ఇందుకు అవసరమైన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని సులభంగా సేవలు పొందుతున్నారు. కొందరు చిరుద్యోగులు, సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌ ద్వారా హోమ్‌ టూ వర్క్‌ చేపడుతున్నారు.


లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌, ఇతర హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలు ఉచిత డోర్‌ డెలివరీ చేస్తున్నాయి. అధికారులు కూడా ఇందుకు అనుమతిచ్చారు. ఈ పరిస్థితుల్లో వ్యయప్రయాసలను తప్పించుకోవడానికి ‘నెట్‌’ ఉపయోగపడుతోంది. ముఖ్యంగా  స్మార్ట్‌ఫోన్‌ దీనికి తోడ్పడుతోంది. ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకొని కొన్ని సంస్థలు వస్తువుల కొనుగోళ్లపై రాయితీనిస్తున్నాయి. 


విద్యార్థులకు విద్యాబోధన

పదో తరగతి పరీక్షలు రెండోసారి వాయిదా పడ్డాయి. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ పరీక్షలను పూర్తిగా రద్దుచేశారు. అందరూ ఉత్తీర్ణత పొందినట్టు ప్రకటించారు.  ఇంటర్‌, డిగ్రీలకు సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. దీంతో తల్లిదండ్రుల్లో ఓకింత ఆందోళన నెలకొంది. ఇటువంటి వారికోసం కొన్ని విద్యా సంస్థలు ‘ఆన్‌లైన్‌’ బోధనకు తెరతీశాయి. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా విద్యార్థుల్లో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ల ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్‌ సైతం అందుబాటులో ఉంచడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటోంది.


టీవీలతో వినోదం

స్వీయ గృహ నిర్బంధం నేపథ్యంలో టీవీలకు ఎక్కువ మంది అతుక్కుపోతున్నారు. సీరియల్‌, సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలు, స్పోర్ట్స్‌. న్యూస్‌ ఛానళ్లు చూస్తూ కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం సీరియళ్ల ప్రసారాలు నిలిపివేసినా పాత కార్యక్రమాలు చూస్తున్నారు. యువకులు యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వీడియో చాట్‌లతో గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీలన్నీ వినియోగదారుల సౌకర్యార్ధం సులభంగా రీచార్జ్‌ చేసుకునే అవకాశాలను కల్పించాయి. బ్యాంకు ఏటీఎం ద్వారా సెల్‌ఫోన్‌ రీచార్జి చేసుకోవడానికి అవకాశమిచ్చాయి. రీచార్జి పరిమిత కాలం ముగిసినా లాక్‌డౌన్‌ ఉన్నంతవరకూ ఇన్‌కమింగ్‌ సదుపాయాన్ని ప్రకటించాయి. 

Updated Date - 2020-04-03T11:15:16+05:30 IST