లాక్‌డౌన్‌ మరింత కఠినతరం

ABN , First Publish Date - 2020-03-31T16:10:39+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణకు..

లాక్‌డౌన్‌ మరింత కఠినతరం

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ ఆదేశం

జీవీఎంసీ పరిధిలో ప్రతి వార్డుకు ఒక వైద్యుడు

మునిసిపాలిటీ పరిధిలో మూడు వార్డులకు ఒకరు

జిల్లాలో 5000 బెడ్‌లను సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచన

మరింత కఠినంగా లాక్‌డౌన్‌


మహారాణిపేట(విశాఖపట్నం): కరోనా వైరస్‌ నియంత్రణకు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, పోలీస్‌ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోందని, దీనిని నియంత్రించడానికి జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రతి వార్డుకు ఒక వైద్యుడు, ప్రతి మునిసిపాలిటీ పరిధిలోని మూడు వార్డులకు ఒక వైద్యుడిని ఏర్పాటు చేయాలన్నారు. వీటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లదేనని చెప్పారు.


వైద్య సేవలకు ప్రైవేటు వైద్యులను సైతం వినియోగించుకోవాలని ఆదేశించారు. విమ్స్‌ ఆస్పత్రిలో ఐసీయూ బెడ్‌లను 400లకు, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ బెడ్‌లను 36 నుంచి 100కి పెంచాలన్నారు. గీతంలో 600 బెడ్‌లను, వెంటిలేటర్‌ బెడ్‌లను 40కి పెంచాలని సూచించారు. జిల్లాకి 5000 బెడ్‌లను కచ్చితంగా సిద్ధం చేయాలని చెప్పారు. కల్యాణ మండపాలు, హోటళ్లు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, హాస్టళ్లను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వ్యవసాయ పనులు చేసుకునేందుకు రైతులు,  రైతు కూలీలకు  మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతి ఇవ్వాలన్నారు. రైతు భరోసా కేంద్రాలను మే 15 నాటికి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ, జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ సృజన, జేసీలు ఎల్‌.శివశంకర్‌, కె.వేణుగోపాల్‌రెడ్డి, పాడేరు సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-31T16:10:39+05:30 IST