రైస్‌ మిల్లులకు తాళం

ABN , First Publish Date - 2022-06-26T06:33:04+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యం.. కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం సేకరణకు ప్రతిబంధకంగా మారింది. మిల్లర్లకు శాపంగా తయారైంది. రైస్‌మిల్లుల్లో గుట్టగుట్టలుగా ధాన్యం నిల్వలు ఉండగా, వాటిని సకాలంలో మిల్లింగ్‌ చేయించకుండా రకరకాల కొర్రీలు పెడుతున్నారు.

రైస్‌ మిల్లులకు తాళం

ఎఫ్‌సీఐ నిర్వాహకంతో 25రోజులుగా నిలిచిన కస్టమ్‌మిల్లింగ్‌

ఉమ్మడి జిల్లాలో నిల్వ ఉన్న 7.24లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం

రోడ్డునపడ్డ 10వేల మంది కార్మికులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యం.. కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం సేకరణకు ప్రతిబంధకంగా మారింది. మిల్లర్లకు శాపంగా తయారైంది. రైస్‌మిల్లుల్లో గుట్టగుట్టలుగా ధాన్యం నిల్వలు ఉండగా, వాటిని సకాలంలో మిల్లింగ్‌ చేయించకుండా రకరకాల కొర్రీలు పెడుతున్నారు. భౌతిక తనిఖీలు, రేషన్‌ బియ్యం పంపిణీ కారణాలుగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను ఎఫ్‌సీఐ ప్రారంభించకపోవడంతో రైస్‌మిల్లులకు తాళాలు పడుతున్నాయి. 15రోజులుగా పని లేకపోవడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన హమాలీలతో పాటు బీహార్‌, ఒడిషా, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలకు ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లే యోచనలో వారున్నారు.



ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 216 రైస్‌మిల్లులు ఉండగా, అందులో 114 రైస్‌మిల్లు ల్లో సీఎంఆర్‌ ధాన్యం ఉంది. 102 మిల్లుల్లో సన్నధాన్యం మిల్లింగ్‌ కొనసాగుతోంది. సన్నధాన్యానికి సంబంధించి ఇబ్బంది లేకపోగా, దొడ్డుధాన్యం మిల్లింగ్‌ చేసే చోటే సమస్యలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 7.24లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. గత ఏడాది యాసంగికి సంబంధించి 24వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ధాన్యం మిల్లుల్లోనే ఉండగా, గత ఖరీ్‌ఫకు సంబంధించి 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కూడా ఉంది. తాజాగా, యాసంగికి సంబంధించిన 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ విభేదాలతో బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ అనుమతించకపోవడంతో మిల్లింగ్‌ నిలిచి మిల్లర్లు, కార్మికులు, మిల్లులపై ఆధారపడిన తౌడు, నూక వ్యాపారులు, సాల్వెంట్‌ ఆయిల్‌మిల్‌ పరిశ్రమ కుదేలవుతోంది.


రోడ్డున పడ్డ 10వేల మంది కార్మికులు

ప్రతి సీఎంఆర్‌ రైస్‌మిల్లులో 50 నుంచి 100 మంది హమాలీలు, ముగ్గురు డ్రైవర్లు, ముగ్గురు గుమస్తాలు, లారీ డ్రైవర్లు పనిచేస్తున్నారు. మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి బియ్యం సమకూర్చే క్రమంలో ప్రతి ఎఫ్‌సీఐ కేంద్రం వద్ద 300 మంది హ మాలీలకు పనిదొరుకుతుంది. ఉమ్మడి జిల్లాలో 600 మంది ఎఫ్‌సీఐ హమాలీలు ఉన్నారు. వీటితో పాటు దొడ్డుధాన్యం మిల్లింగ్‌ చేయగా వచ్చిన తౌడు, నూకను విక్రయించి కొద్ది మంది వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. దొడ్డు ధాన్యం మిల్లిం గ్‌ ద్వారా వచ్చిన తౌడుతో రైస్‌బ్రౌన్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ పరిశ్రమ మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేయడంతో ఈ పరిశ్రమ సైతం మూతపడింది. సీఎంఆర్‌ ధాన్యం మిల్లింగ్‌ చేసే రైస్‌మిల్లులు ఉమ్మడి జిల్లాలో 114 ఉండగా, ఒక్కో మిల్లుపై సగటున 75 మంది కార్మికులు అనుకుంటే మొత్తంగా 8,550 మంది ఉపాధి కోల్పోయారు.


ఎంత నిల్వ ఉంటే అంత నష్టం

రైస్‌మిల్లర్లకు గోదాంలు లేవు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించి మిల్లుల్లో డంప్‌చేశారు.మిల్లర్లంతా బహిరంగ ప్రదేశాల్లోనే ధాన్యం బస్తాలు ఉంచా రు. అవి ఎండకు ఎండుతూ,వానకు తడుస్తున్నాయి. నెలల తరబడి నిల్వ ఉంచడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటోంది. ప్రకృతి విపత్తులను భరించి మిల్లింగ్‌ చేసి స్తే ఎఫ్‌ఏక్యూ నిబంధనలతో ఎఫ్‌సీఐ బియ్యం తిరస్కరిస్తోంది. మరోవైపు నిల్వ కో సం రెండు నెలలు మాత్రమే ఎఫ్‌సీఐ డబ్బులు చెల్లిస్తోంది. అంతకుమించి ఎంత కాలం ఉన్నా ఆచార్జీలు బ్యాంకు వడ్డీని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ భరించాల్సిందే.


ఆర్థికంగా చితికిపోతున్నాం : యాదగిరి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

కేంద్ర, రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నాం. లక్షల టన్నుల ధాన్యం తేమతో చేతికొచ్చే పరిస్థితి లేదు. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఈ క్రమంలో ఎక్కడ తేడా వచ్చినా మిల్లర్‌దే బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు నష్టపోయే వాతావరణం నెలకొంది. మిల్లులు నడవకపోవడంతో ఇతర రాష్ట్రాల కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పనిలేకుండా వారికి ఒకటి లేదా రెండు నెలల పాటు మాత్రమే జీతాలు ఇవ్వగలం. మిల్లు నడవకున్నా కరెంటు బిల్లు వస్తోంది.       

Updated Date - 2022-06-26T06:33:04+05:30 IST