లాక్‌డౌన్‌తో 'లాక్‌' తిప్పలు!

ABN , First Publish Date - 2020-09-12T15:45:43+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటిలో లాక్‌ల పరిశ్రమ కూడా ఒకటి. లాక్‌డౌన్ కారణంగా తాళాల తయారీకి కావలసిన ముడిసరుకుల లభ్యత కూడా కరువైందని, దీంతో ఈ పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు.

లాక్‌డౌన్‌తో 'లాక్‌' తిప్పలు!

కిటకిటలాడే దుకాణాలు మూతపడ్డాయి. కళకళలాడే వీధులు వెలవెలబోయాయి. ఉత్పత్తికోసం స్వేదం చిమ్మే కర్మాగారాలు మూగబోయాయి. రాళ్లెత్తే కూలీలేకాదు నిర్మాణాలు సాగించే కాంట్రాక్టర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రయాణికులను చేరవేసే ఆటోలు, బస్సులు రోడ్డెక్కలేదు. మరమగ్గాల చప్పుడు లేదు. పనిలేదు. పరిశ్రమ లేదు. డబ్బు లేదు. పేదలకు ఆకలి తీరే మార్గం లేదు. పెద్దలకు సంపాదన పెరిగే దారి లేదు. ఇదంతా కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావమే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశాలన్నీ ఎంచుకున్న తొలిమార్గం.. లాక్‌డౌన్. అయితే దీనివల్ల చాలా చిన్న-మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. వీటిలో చాలా సంస్థలు మూతపడ్డాయి కూడా. ఇప్పుడు లాక్‌డౌన్‌ తొలగించినా కరోనా భయంతో ఆయా పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు.


లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటిలో లాక్‌ల పరిశ్రమ కూడా ఒకటి. లాక్‌డౌన్ కారణంగా తాళాల తయారీకి కావలసిన ముడిసరుకుల లభ్యత కూడా కరువైందని, దీంతో ఈ పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. వ్యాపారం నష్టాల్లో ఉండటంతో వర్కర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని, దీంతో చాలామంది పని మానేస్తున్నారని చెప్తున్నారు. అంతేగాక, ఇటువంటి పరిశ్రమల్లో ఎక్కువగా వలస కూలీలే పనిచేస్తారని, లాక్‌డౌన్‌ సమయంలో వీరంతా స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ తొలగించినా కూడా కరోనా భయం, జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో వీరెవరూ తిరిగి పనులకు రావడం లేదు. దీంతో ఈ పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ పని కూడా ఉండటం లేదని, ఇది కూడా వర్కర్లకు ఇబ్బంది కలిగిస్తోందని సమాచారం. ఇళ్ల వద్ద చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేసి మరీ పనికి వచ్చినా రోజు గడవడం కష్టమైపోతోందనేది వర్కర్ల వాదన.


కాగా, భారత్‌లో దాదాపు 6.9 కోట్ల ఎంఎస్ఎంఇ(సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లు ఉన్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఈ పరిశ్రమల సప్లయ్ చెైన్ పూర్తిగా చెదిరిపోయిందని ఆయా పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారుల రాకపోకలు పూర్తిగా తగ్గిపోవడంతో చిన్న పరిశ్రమలకు ముడి సరుకు దొరకడం లేదు. దీనిపై అలీగఢ్‌లో తాళాల పరిశ్రమలు నిర్వహించే వ్యాపారులు మాట్లాడుతూ.. తాళాల తయారీ పరిశ్రమ తీవ్రమైన నష్టాల్లో ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాల మధ్య వ్యాపారుల రాకపోకలు నిలిచిపోవడంతో ముడిసరుకు దొరకడం లేదని చెప్పారు. అదే సమయంలో గతంలో టాటా, మారుతి వంటి పెద్ద కంపెనీల నుంచైనా ముడి సరుకు లభించేదని, కానీ ప్రస్తుతం ఆయా సంస్థలు కూడా మూతపడటంతో పరిస్థితి మరింత దిగజారిందని వివరించారు. ‘ప్రస్తుతం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. సప్లై చెయిన్ దెబ్బతిన్న కారణంగా ప్రతి రోజూ వర్కర్లకు పని ఉండటం లేదు. సంస్థల టర్నోవర్‌లు కూడా పడిపోయాయి. దీంతో పనివాళ్లకు జీతాలు ఇవ్వాలన్నా చాలా కష్టంగా ఉంటోంది' అని తాళాల తయారీ పరిశ్రమ నిర్వాహకులు చెప్తున్నారు.


భారతదేశ జీడీపీలో కూడా 30-35 శాతం ఎంస్ఎంఇల నుంచే వస్తుంది. అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీల్లా ఈ చిన్న-మధ్య తరహా పరిశ్రమల్లో వర్క్ ఫ్రం హోం చేయడం కుదరదు. వర్కర్లు పరిశ్రమకు రాకపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ కారణంగానే లాక్‌డౌన్‌ సమయంలో ఈ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ తొలగించాక కూడా ఈ పరిశ్రమల ముఖచిత్రాల్లో పెద్దగా మార్పు రాలేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఆహార, ఫార్మా, వైద్య పరికరాలకు సంబంధించిన పరిశ్రమలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినప్పటికీ, మిగిలిన వ్యాపారాలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి.  ఇవి మూతపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్న దాదాపు 11 కోట్ల 40 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.

Updated Date - 2020-09-12T15:45:43+05:30 IST