భారీగా నామినేషన్లు

ABN , First Publish Date - 2022-02-04T13:27:34+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం ముగియనుండటంతో డీఎంకే, అన్నాడీఎంకే సహా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు వేయడానికి ఆయా ప్రాంతీయ ఎన్నికల కార్యాలయాల వద్ద బారులు

భారీగా నామినేషన్లు

                     - అభ్యర్థులతో కిటకిటలాడుతున్న ఎన్నికల కార్యాలయాలు


చెన్నై: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల గడువు శుక్రవారం ముగియనుండటంతో డీఎంకే, అన్నాడీఎంకే సహా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు వేయడానికి ఆయా ప్రాంతీయ ఎన్నికల కార్యాలయాల వద్ద బారులు తీరారు. కార్యాలయం పరి సరాల్లోకి అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని ఎన్నికల సంఘం నిబంధన విధించినప్పటికీ, ఓ వైపు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు, మరో వైపు ప్రధాన పార్టీల అభ్యర్థులతో ప్రాంతీయ ఎన్నికల కార్యాలయాల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. నామినేషన్లు సమర్పించేందుకు క్యూలైన్ల లో నిలిచిన అభ్యర్థులను, వారి అనుచరులను కట్టడి చేయలేక పోలీసులు తంటాలు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. 1374 కార్పొరేషన్‌ వార్డులు, 3843 మునిసిపల్‌ వార్డులు, 12,838 పట్టణ పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. చెన్నై సహా కొన్ని నగరాలకు సంబంధించి డీఎంకే, అన్నాడీఎంకేలు యాభైశాతానికిపైగా అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. నామినేషన్లకు ఒక రోజు మాత్రమే గడువు ఉండటంతో తమకు సీటు వస్తుందనే నమ్మకం కలిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా గురువారమే నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ కారణాల వల్ల ప్రాంతీయ ఎన్నికల అధికారుల కార్యాలయాలన్నీ జనంతో కిటకిట లాడాయి. గురువారం అన్నాడీఎంకే తరఫున మాజీ ఐఏఎస్‌ అధికారిణి శివగామి షెనాయ్‌నగర్‌లోని ఎన్నికల అధికారి వద్ద నామినేషన్‌ వేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 7590 మంది నామినేషన్లు  వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లోనూ గురు వారం నామినేషన్ల స్వీకరణ ఊపందుకుంది. ప్రతి చోటా వందల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

శుక్రవారం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. చెన్నై కార్పొరేషన్‌లో 200 వార్డులకుగాను ఇప్పటివరకూ 418 మంది నామినేషన్లు వేశారని, వీరిలో 177 మంది మహిళలని తెలిపారు. తిరువళ్లూరు జిల్లాల్లో ఓ కార్పొరేషన్‌, ఆరు మున్సిపాలిటీలు, ఎనిమిది పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ డీఎంకే, అన్నాడీఎంకే సహా ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ముప్పావు శాతం మంది నామినేషన్లు వేశారు. ఇదే విధంగా కోవై, తిరుచ్చి, మదురై, తంజావూరు కార్పొరేషన్లలోనూ గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులంతా బారులు తీరారు.

Updated Date - 2022-02-04T13:27:34+05:30 IST