అప్పులు చేసి అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST

అప్పులు చేసి అభివృద్ధి పనులు

అప్పులు చేసి అభివృద్ధి పనులు
పలు సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తున్న సభ్యురాలు

  • ఏళ్లు గడుస్తున్నా మంజూరు కాని నిధులు 
  • మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆందోళన

శామీర్‌పేట, జూలై 4 : అప్పులు చేసి గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు చేయించి ఏళ్లు గడుస్తున్నా నిధులు మంజూరు చేయడం లేదని మండల సభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ హారిక అధ్యక్షతన మూడుచింతలపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి విచ్చేశారు. గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో భాగంగా చేపట్టిన పనులకు నిధులను ఎందుకు మంజూరు చేయడం లేదని, ఎన్నిసార్లు అడిగినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జగ్గంగూడ సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు ఇతర సర్పంచ్‌లు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరం గ్రామంలో అధికారులు ఇంతవరకూ పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేయడం లేదని, ఈ విషయంపై ఎంపీటీసీలకు సర్పంచ్‌లు సమాచారం ఇవ్వటం లేదని ఆ గ్రామ ఎంపీటీసీ హనుమంతరెడ్డి సభలో ఆందోళన వ్యక్తం చేశారు. మూడుచింతలపల్లిలో రైతు సహకార సంఘం బ్యాంకును ఏర్పాటు చేయాలని, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డిని సభలో కోరారు. ఈ విషయంపై వైస్‌ చైర్మన్‌ స్పందిస్తూ సాధ్యమైనంత వరకు త్వరలోనే మూడుచింతలపల్లిలో రైతు సహకార బ్యాంకును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని సభ్యులకు భరోసా ఇచ్చారు. గ్రామాల్లో పొలాలకు విద్యుత్‌ సరఫరా రోజుకు కనీసం ఏడుగంటలు కూడా ఇవ్వడం లేదని నారాయణపూర్‌ ఎంపీటీసీ అఖిలే్‌షరెడ్డి సభలో ఆందోళన వ్యక్తం చేశారు. మూడుచింతలపల్లి గ్రామ పరిధిలోని అసైన్డ్‌ భూములకు కొత్తగా ధరణి పట్టాదారు పాస్‌ బుక్కులను రైతులకు ఇచ్చేందుకై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తహసీల్దార్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అలాగే లక్ష్మాపూర్‌ గ్రామ పరిధిలోని రైతుల పట్టాభూములకు ధరణి పాస్‌ పుస్తకాల జారీ పంపిణీ పూర్తి కావస్తోందని తహసీల్దార్‌ చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సభలో సభ్యులు తహసీల్దార్‌ను కోరారు. అలాగే మండలంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభలో పలు సమస్యలపై ప్రశ్నిస్తూ అధికారులను నిలదీశారు. అనంతరం జడ్పీ చైర్మన్‌, ఎంపీపీ హారికలు మాట్లాడుతూ సభలో సభ్యులు అడిగిన వివిధ సమస్యలపై తప్పనిసరిగా పరిష్కార చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికై వివిధ పనులను చేపట్టుటకు ప్రభుత్వ నిధులను మంజూరు చేయుటకై తప్పనిసరిగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో రవి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:30:00+05:30 IST