ఎన్‌డీసీసీబీ ద్వారా ఇతోధికంగా రుణాలు

ABN , First Publish Date - 2020-12-06T04:15:45+05:30 IST

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు ఇతోధికంగా రుణాలు అందిస్తామని ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి తెలిపారు.

ఎన్‌డీసీసీబీ ద్వారా ఇతోధికంగా రుణాలు
విలేకరులతో మాట్లాడుతున్న చైర్మన్‌ విజయకుమార్‌రెడ్డి

 చైర్మన్‌ విజయకుమార్‌రెడ్డి

నెల్లూరు(హరనాథఫురం), డిసెంబరు 5 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు ఇతోధికంగా రుణాలు అందిస్తామని ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి  తెలిపారు.  డీసీసీబీ కమిటీ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఎన్‌డీసీసీబీ సమావేశమందిరంలో కేకు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయకుమార్‌రెడ్డి  విలేకరులతో మాట్లాడుతూ మార్చి నుంచి ఇప్పటి వరకు రైతులకు 7 శాతం వడ్డీకే 20 శాతం ఎస్‌ఎల్‌ఎఫ్‌ రుణాలను అదనంగా ఇచ్చామన్నారు. నలుగురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పాటైతే యంత్రాల కొనుగోలుకు రూ.15లక్షల రుణసదుపాయం కల్పిస్తామన్నారు. భారీ యంత్రాల కొనుగోలుకు కస్టమ్‌ హైరింగ్‌ హబ్‌లను ప్రవేశపెట్టామన్నారు. వాటి ద్వారా రైతులకు రూ.1.5కోట్ల రుణసదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఈ యంత్రాల కొనుగోలుపై 40 శాతం సబ్సిడీ ఉంటుందనీ,  10 శాతం సబ్సిడీని కోఆపరేటివ్‌ సొసైటీలు భరిస్తాయనీ తెలిపారు. జిల్లాలో నాబార్డు సహకారంతో కోవూరు, అల్లూరు, నాయుడుపేట, తడ తదితర చోట్ల భవనాల నిర్మాణం చేపడతామన్నారు. డీసీసీబీకి ఇప్పటికే 20 బ్రాంచీలు ఉన్నాయనీ,  జలదంకి, డక్కిలి, దుత్తలూరు, తడలో నూతన బ్రాంచీలను  ఏర్పాటు చేస్తామనీ వెల్లడించారు. వరదలు, వర్షాలకు పంటలు పండని రైతులు తీసుకున్న రుణాలకు ముందు వడ్డీ చెల్లించి, కొంత విరామం తరువాత అసలు చెల్లించే వెసలు బాటు కల్పించామన్నారు. తమ బ్యాంకు ద్వారా మూడు లక్షల రుణం తీసుకున్న రైతులకు రూ.లక్ష వరకు సున్నావడ్డీ వర్తించేలా చేశామన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తున్నామన్నారు.  23 హోదాల్లో ఉన్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పిస్తామన్నారు. ఉద్యోగులకు డీసీసీబీ ద్వారా గృహ, వాహన రుణాలను అందజేస్తామన్నారు. సమావేశంలో ఎన్‌డీసీసీబీ జీఎం  సరిత, డైరెక్టర్లు సీహెచ్‌ తిరుమలరాణి, మధుసూధన్‌రావు, సోమశేఖర్‌రెడ్డి, ఎస్‌కే గౌస్‌మొహిద్దీన్‌  పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:15:45+05:30 IST