Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మద్యంతో కాలేయం ఖతం!

twitter-iconwatsapp-iconfb-icon
మద్యంతో కాలేయం ఖతం!

ఆంధ్రజ్యోతి(20-10-2020)

కొవిడ్‌ కాలంలో కరోనా కేసులతో సమానంగా మద్యపాన  సేవనం కూడా పెరిగింది. లాక్‌డౌన్‌తో తీరిక సమయం చిక్కడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం... ఇలా మందు మీదకు మనసును మళ్లించే కారణాలు బోలెడన్ని చోటుచేసుకున్నాయి. అయితే మితిమీరిన మద్యంతో కాలేయం తిరిగి సరిదిద్దలేనంతగా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు గ్యాస్ర్టోఎంటరాలిజిస్ట్‌, డాక్టర్‌ నవీన్‌ పోలవరపు.


కాలేయం విషాలను హరించే అతి పెద్ద కర్మాగారం. ఇది మద్యాన్ని కూడా వడగడుతూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో కాలేయ కణాలు చనిపోతూ ఉంటాయి. అయితే తిరిగి రీజనరేట్‌ అయ్యే స్వభావం మూలంగా కొత్త కణాలు పుడుతూ కాలేయ సామర్థ్యం తగ్గకుండా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే పరిమితి మించి కాలేయం మీద మద్యం భారం పడుతుందో, అప్పుడు కాలేయం పునరుజ్జీవానికి అడ్డుకట్ట పడుతుంది. కాలేయ కణాలు శాశ్వతంగా చనిపోయి, ప్రాణాంతక పరిస్థితి నెలకొంటుంది. మితిమీరిన మద్యపానం ప్రారంభ దశలో అదనపు కొవ్వు (హెపాటిక్‌ స్టెటోసిస్‌) కాలేయంలో పేరుకుంటుంది. ఇది మున్ముందు ఇన్‌ఫ్లమేషన్‌కు (ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌) దారితీసి, చివరకు తిరిగి సరిదిద్దే వీలు లేని సిర్రోసిస్‌కు చేరుకుంటుంది. 


లక్షణాలు ఇవే!

కాలేయం దెబ్బతినే ప్రారంభంలో బయల్పడే లక్షణాలను దాదాపు అందరూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాంతో లోలోపల కాలేయానికి నెమ్మదిగా నష్టం జరుగుతూ తీవ్రంగా జబ్బుపడుతుంది. కాలేయం జబ్బుపడే క్రమంలో కామెర్లు, ఆకలి మందగించడం, బరువు కోల్పోవడం, జ్వరం, వణుకు, పొట్ట, కాళ్ల వాపులు, రక్తపు వాంతులు, రక్తపు విరేచనాలు, మెదడులో రక్తస్రావం, మత్తు మొదలైన లక్షణాలు ప్రధానంగా బయల్పడతాయి. ఈ లక్షణాలతో వైద్యులను కలిసే సమయానికే కాలేయం చివరి దశ అయిన సిర్రోసిస్‌కు చేరుకుని ఉంటుంది.


పరీక్షలు!

సాధారణంగా ఆల్కహాల్‌ ఆధారిత కాలేయ జబ్బును కొన్ని రక్తపరీక్షలు, పొట్ట స్కాన్‌తో నిర్థారించవచ్చు. ఫలితాన్ని బట్టి వ్యాధి తీవ్రత, అందించవలసిన చికిత్స గురించి వైద్యులు అంచనాకు వస్తారు.


మందు... మందు మానడమే!

కాలేయం అత్యద్భుతమైన అవయవం. ప్రారంభ దశలోనే దాన్ని జబ్బుకు గురిచేసే కారణానికి అడ్డుకట్ట వేయగలిగితే, ఆ క్షణం నుంచే కాలేయం ఆరోగ్యం పుంజుకోవడం మొదలుపెడుతుంది. దీన్ని బట్టి మద్యం ఆధారిత కాలేయ వ్యాధికి మందు మద్యం మానడమే అని గ్రహించాలి. అయితే ఒకవేళ కాలేయం దాని చివరి దశ అయిన సిర్రోసిస్‌కు చేరుకుని, ఆరోగ్యాన్ని కుదేలు చేస్తే, కాలేయ మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. కాబట్టి ప్రారంభ దశలోనే కాలేయ వ్యాధిని కనిపెట్టి, తిరిగి కాలేయాన్ని మామూలు స్థితికి చేర్చడానికి తోడ్పడే కాలేయ నిపుణులను సంప్రతించాలి.


కాలేయ వ్యాధులకు దారితీసే 100 కారణాల్లో, మద్యం ప్రధానంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్త కాలేయ జబ్బుల్లో మద్యం ఆధారిత కాలేయ వ్యాధులే అధికం. ప్రపంచవ్యాప్తంగా 40ు మందికి మద్యపానం అలవాటు ఉంటే, గత 20 ఏళ్ల కాలంలో భారతీయుల్లో మద్యపానం అలవాటు ఇంతకు నాలుగు రెట్లు పెరిగినట్టు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టే మద్యం ఆధారిత కాలేయ వ్యాధులు, మరణాలు పెచ్చుపెరుగుతున్నాయి. గత పదేళ్ల కాలంలో మహిళల్లో కూడా మద్యపానం అలవాటు పెరిగింది. పురుషులతో పోలిస్తే, మహిళలకు మద్యం చేసే చేటు ఎక్కువ!

మద్యంతో కాలేయం ఖతం!

అలవాటు మానుకుందాం!

కొవిడ్‌- 19 ఊహించని ఎన్నో పరిణామాలకు దారి తీసింది. ఎక్కువ కాలం పాటు ఇళ్లకే పరిమితం కావడం, శారీరక వ్యాయామం కొరవడడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం... ఇలా పలు కారణాలతో కొవిడ్‌ కాలంలో మద్యానికి చేరువైన వాళ్లు ఎంతోమంది. పూర్వంతో పోలిస్తే కొవిడ్‌ తదనంతరం ఆల్కహాల్‌ సంబంధిత కాలేయ వ్యాధుల బారిన పడేవాళ్ల సంఖ్య పెరిగింది. వీళ్లలో ఎక్కువ శాతం చివరి దశ కాలేయ వ్యాధికి చేరుకున్నవారే ఉండడం బాధాకరం. మద్యపానం సేవనం పరిణామాలు, ఆరోగ్యం మీద మద్యం ప్రభావాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలగడం అవసరం. కాలేయం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అలవరుచుకోవడం తప్పనిసరి. మానసిక ప్రశాంతత చేకూరే యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా ఆల్కహాల్‌ అలవాటు నుంచి దూరం కావచ్చు. ఆరోగ్యకరమైన జీవనవిధానంతో ఆనందమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు అనే విషయం గుర్తెరిగి మెలగాలి!

మద్యంతో కాలేయం ఖతం!

డాక్టర్‌ నవీన్‌ పోలవరపు,

సీనియర్‌ కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

9008987245


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.