Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 12 Apr 2022 10:52:07 IST

ఎండ ఎక్కువగా ఉందని చిల్డ్ బీర్లు తాగేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

twitter-iconwatsapp-iconfb-icon
ఎండ ఎక్కువగా ఉందని చిల్డ్ బీర్లు తాగేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి(12-04-2022)

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చలచల్లని పానీయాలు తాగాలనిపించడం సహజం. అయితే వేసవి పానీయంగా చిల్డ్‌ బీరును ఎంచుకునేవాళ్లూ కొందరుంటారు. హార్డ్‌ లిక్కర్‌తో పోలిస్తే, బీరుతో ఆరోగ్య నష్టం తక్కువ అని వాళ్ల నమ్మకం. అయితే అదంతా అపోహ అనీ, బీరుతోనూ బోలెడన్ని తిప్పలుంటాయనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


పళ్లు ఊడగొట్టుకోడానికి ఏ రాయి అయితేనేం? ఈ నానుడి మద్యానికీ వర్తిస్తుంది. ఏ రకమైన మద్యంతోనైనా కాలేయానికి జరిగే చేటు ఒక్కటే! రోజూ తక్కువ మోతాదుల్లో తాగినా (రెగ్యులర్‌ డ్రింకింగ్‌), అరుదుగా ఎక్కువ మోతాదులో తాగుతూ ఉన్నా (బింజ్‌ డ్రింకింగ్‌) రెండు అలవాట్లూ కాలేయానికి చేటు చేసేవే! అలాగే విస్కీ, బ్రాందీ, ఓడ్కా లాంటి హార్డ్‌ లిక్కర్‌తో పోలిస్తే, బీరు సురక్షితమైన మద్యంగా ఎక్కువమంది పరిగణిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఏ మద్యంలోనైనా అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌ మెతాదు కీలకం.

 

బీరు లైట్‌ డ్రింక్‌ కాదు

ప్రతి 100 మిల్లీ లీటర్ల హార్డ్‌ లిక్కర్‌లో 42% (42 గ్రాములు) ఆల్కహాల్‌ ఉంటుంది. ఎవరైనా సాధారణంగా కనిష్టంగా 30 నుంచి 60, 90 మిల్లీలీటర్లు, గరిష్టంగా 180, 250 మిల్లీలీటర్లు లేదా అంతకుమించి హార్డ్‌ లిక్కర్‌ తీసుకుంటూ ఉంటారు. ఆ మద్యంతో ఏకంగా 100 నుంచి 150, రెండు వందల గ్రాముల అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌ శరీరంలోకి చేరుతుంది. ఇక బీరు విషయానికొస్తే, కొందరు ఒక బీరుతో సరిపెట్టుకుంటే ఇంకొందరు అంతకుమించి రెండు, మూడు బీర్లు లేపేస్తూ ఉంటారు. 100 మిల్లీలీటర్ల బీరులో 5% ఆల్కహాల్‌ మోతాదు ఉంటే, 500 లేదా 650 మిల్లీలీటర్ల బీరు తాగినప్పుడు, 25 నుంచి 35 గ్రాముల ఆల్కహాల్‌ శరీరంలోకి చేరుతుంది. ఇది 100 మిల్లీ లీటర్ల హార్డ్‌ లిక్కర్‌లోని ఆల్కహాల్‌ మోతాదుతో సమానం. అయితే ఒక్క బీరుతో ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి రెండు లేదా మూడు బీర్లతో అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌ మోతాదు 100 గ్రాములకు పెరిగిపోతుంది. కాబట్టి బీరులో ఆల్కహాల్‌ మోతాదు తక్కువ కాబట్టి సురక్షితం అనుకోకూడదు. బీరు పరిమాణాన్ని బట్టి ఆల్కహాల్‌ మోతాదును లెక్కించి, ఆ మేరకు పరిమితుల్లో ఉండాలి. 


వేసవి ప్రభావం

ముందు నుంచీ కాలేయ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు వేసవిలో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. ఈ కోవకు చెందిన వాళ్లు తేలికగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరంలో ఎలకొ్ట్రలైట్ల అసమతౌల్యానికి కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ కాలంలో సరిపడా నీళ్లు తాగుతూ, నీడ పట్టున ఉండాలి. విపరీతంగా చమటలు పట్టిన సందర్భాల్లో ఎలకొ్ట్రలైట్లు కలిగి ఉండే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఎలకా్ట్రల్‌ లాంటి పానీయాలు తాగుతూ ఉండాలి. 


ఈ లక్షణాల మీద ఓ కన్నేసి... 

మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తున్నా, లక్షణాల తీవ్రత తక్కువ కాబట్టి మనంతట మనం గ్రహించలేం. పైగా ఆ లక్షణాలను ఇతరత్రా కారణాలకు అన్వయించుకుంటూ ఉంటాం. కానీ తేలికగా అలసటకు లోనవుతున్నా, ఆకలి తగ్గినా, మద్యంతో కాలేయం దెబ్బతినడం మొదలుపెట్టిందని గ్రహించాలి. ఇవి తొలి దశలో కనిపించే లక్షణాలు. కాలేయం మరింత దెబ్బతింటే కామెర్లు మొదలవుతాయి. 


సేఫ్‌ లిమిట్‌

మహిళలకు వారానికి మూడు డ్రింకులు, పురుషులకు వారానికి ఐదు డ్రింకులు సురక్షితమైన మద్యం మోతాదులుగా మునుపటి అధ్యయనాలు చెప్పడం జరిగింది. 500 మిల్లీలీటర్ల బీరు లేదా 30 గ్రాముల అబ్జల్యూట్‌ ఆల్కహాల్‌ను ఒక డ్రింకుగా పరిగణించాలి.


కొవిడ్‌ బారిన పడినంత మాత్రాన, కాలేయం దెబ్బతినే పరిస్థితి ఉండదు. తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురై, కాలేయానికి కూడా సోకినప్పుడు మాత్రమే కాలేయం దెబ్బతింటుంది. అయితే కొవిడ్‌ సమయంలో పలురకాల యాంటీబయాటిక్‌ మందులు వాడుకున్నాం. దాంతో కాలేయం కొంత ఒత్తిడికి లోనైంది. అలాంటి కాలేయాన్ని మద్యంతో మరింత ఇబ్బంది పెట్టడం సరి కాదు. కాబట్టి కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు మరి కొంత కాలం పాటు మద్యానికి దూరంగా ఉండడమే మేలు.

 

డాక్టర్‌ కె.ఎస్‌ సోమశేఖర రావు,

సీనియర్‌ కన్సల్టెంట్‌,

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ హెపటాలజిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.