‘మందు’ పాట్లు

ABN , First Publish Date - 2020-04-04T11:31:20+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. గొంతులో చుక్క పడకపోతుండడంతో మందుబాబులు విలవిల్లాడిపోతున్నారు.

‘మందు’ పాట్లు

చుక్కదొరక్క విలవిల్లాడుతున్న వ్యసనపరులు


ఆంధ్రజ్యోతి, కాకినాడ/జీజీహెచ్‌ : 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. గొంతులో చుక్క పడకపోతుండడంతో మందుబాబులు విలవిల్లాడిపోతున్నారు. చేతులు, కాళ్లు వంకర్లు పోయి గింజుకుపోతున్నారు. దిక్కులేక సారా కోసం వెంపర్లాడుతున్నారు. ఫలానాచోట సారా దొరుకుతుందనే పుకార్లతో అక్కడకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడకు వెళ్లాక ఇప్పుడే రైడ్‌ జరిగిందని, సరుకంతా నేలపాలయ్యిందనే మాటలు విని పిచ్చెక్కిపోతున్నారు. కాస్త దర్జా ఒలగబోసే వారు మాత్రం బయటపడకుండా వివిధ మార్గాల్లో మద్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎగువ శ్రేణి సోగ్గాళ్లకు ఎక్కడో ఒక చోట అరకొరగా మొన్నటివరకు కొన్ని బ్రాండ్లు దొరికాయి. దిగువ శ్రేణి వారు మాజీ సైనికుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేయగా దొరికిన సరుకుతో సర్దుకున్నారు. ఇప్పుడు ఉన్నదంతా అయిపోవడంతో పాట్లు పడుతున్నారు.


జిల్లా జనాభా సగటు లెక్కల మేరకు 45 లక్షల్లో సుమారు 9 శాతం మంది మద్యానికి బానిసలైన వారున్నారని తెలు స్తోంది. 5 శాతం రెగ్యులర్‌గా రాత్రి పూట, 4 శాతం పగలు, రాత్రుళ్లు, 7 శాతం మంది ఫంక్షన్లు, వేడుక సమయాల్లో మద్యం సేవిస్తుంటారని సమాచారం. లాక్‌డౌన్‌తో ఇంకొంత కాలం అమ్మకాలు నిలిపివేస్తే ఇంచుమించు తొమ్మిది శాతం మంది తట్టుకోలేరనే భావన వ్యక్తమవుతోంది. మద్యం లభించకపోవడంతో గుండెదడ, చెమటలు పట్టడం, చిరాకు, నిద్రలేమి, ఆకలి మందగింపుతో  పలువురు వెర్రికేకలు పెడుతున్నారని రెగ్యులర్‌గా మద్యం సేవించే వారి కుటుంబీ కుల ద్వారా తెలుస్తోంది.


మరికొందరు తలనొప్పితో పాటు చేతులు వణుకుతున్నాయని, తాగాలన్న కోరిక బలీయంగా ఉన్నా మందు దొరక్క అసహనానికి గురవుతున్నారని, మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యాప్రయత్నాలకు ఒడిగడుతున్నారని సమాచారం. కాగా వ్యసనపరులు ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 25 మంది మరణించినట్టు సమాచారం. అయితే ఇవి అధికారికంగా నిర్ధారణ కాలేదు.


జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు

మద్యం వ్యసనపరులకు చికిత్స అందించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా వార్డు ఉంది. ఇక్కడ 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటారు. మొదటి దశలో ఓపీకి వస్తే బయటపడే అవకాశం ఉంది. 2, 3 దశల్లో ఇన్‌పేషెంట్‌గా చికిత్స కోసం అడ్మిషన్‌ చేసుకుంటారు. రుగ్మత నుంచి బయట పడే వరకు వైద్యం లభిస్తుంది. 4వ దశలో సకాలంలో వచ్చినా ఐసీయూ ద్వారా చికిత్స ఉంది. కాని ఎవరూ రావట్లేదు.


మానసిక సంఘర్షణతో చనిపోయే ప్రమాదం..డాక్టర్‌ వి.వరప్రసాద్‌, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్‌, కాకినాడ

మద్యం తాగకపోతే వ్యసనపరుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కోసారి తీవ్ర ఒత్తిడికి లోనై ప్రాణాలు కోల్పోయే స్థితికీ చేరుకోవచ్చు. మొదటి దశలో మద్యం తాగకపోతే గుండె దడ, చెమట పట్టడం, చిరాకు, నిద్రలేమి, ఆకలి మందగింపు, తలనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. రెండో దశలో డెలీరియం లక్షణాలు కనిపిస్తాయి. ఆ దశలో మద్యం తాగకపోతే పరిసరాలను, మనుషులను కొంతసేపు గుర్తిపట్టినట్టు, మరికొంతసేపు గుర్తుపట్టనట్టు ప్రవరిస్తారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు భ్రమతో ఏవేవో వింత శబ్దాలు, సైగలు చేస్తారు. ఇంటి నుంచి పారిపోవడం వంటి చర్యలకు పాల్పడతారు. 3వ దశలో ఫిట్స్‌ రావచ్చు. రెండుసార్లు ఫిట్స్‌ వస్తే ప్రమాదం లేదు. అయితే స్టేటస్‌ ఎపిలెప్టికర్స్‌ స్టేజ్‌లోకి వెళితే ప్రాణహాని ఉంటుంది. 4వ దశలో మానసిక సంఘర్షణకు గురై విపరీతమైన ఒత్తిడితో హెపటిక్‌ ఇన్స్‌ఫొలోపతి (కోమా)లోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది.

Updated Date - 2020-04-04T11:31:20+05:30 IST